శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌కు చార్జ్ మెమో : రేపు తిరుపతికి పవన్

anju yadav
శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజు యాదవ్ చిక్కుల్లో పడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న జనసేన పార్టీ నేత సాయిపై ఆమె అకారణంగా చేయి చేసుకున్నారు. రెండు చెంపలపై కొట్టారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ నేతపై దెబ్బ పడితే తనపై పడినట్టేనని ప్రకటించారు. 
 
అందుకే తమ పార్టీ నేత పట్ల దురుసుగా ప్రవర్తించిన అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై వినతి పత్రం సమర్పించేందుకు ఆయన సోమవారం తిరుపతికి వస్తున్నారు. జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. ఇదిలావుంటే, సీఐ అందు యాదవ్‌కు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చార్జ్ మెమో జారీచేసినట్టు తెలుస్తుంది. అయితే, దీనిపై స్పష్టత రావాల్సివుంది. 
 
ఇంకోవైపు, అంజు యాదవ్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటాగా స్వీకరించిన హెచ్.ఆర్.సి.. అంజు యాదవ్‌కు నోటీసులు జారీచేసింది. ఆమెతో పాటు స్టేషన్ ఆఫీసర్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి ఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీఐజీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు ఈ నోటీసులు జారీచేసింది. పైగా ఈ ఘటనపై విచారణ జరిపి ఈ నెల 27వ తేదీలోపు నివేదిక సమర్పించాలని అందులో పేర్కొంది.