శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 20 మార్చి 2021 (17:01 IST)

ఒక్కో శవం దహనానికి రూ.4వేల నుంచి రూ.5 వేల వరకూ వసూళ్లు..?

మంగళగిరి:మనిషి చనిపోయినప్పుడు విలువ ఇవ్వకపోయినా... కనీసం చచ్చిన తర్వాతైనా ఆ శవానికి కాస్త పద్ధతిగా దహనసంస్కారాలు చేయాలనుకుంటారు. ఎలాంటి మనిషి అయినా చనిపోతే అయ్యోపాపం అనుకుంటాం. కానీ వారు మాత్రం చచ్చినవాళ్లకు కూడా విలువ ఇవ్వరు. శవాల్ని కూడా కాసులు కురిపించే యంత్రాల్లా చూస్తారు. వారే  మంగళగిరి మండలం లోని  ఆయా గ్రామ స్మశాన వాటికల కాటికాపరులు.
 
ఆత్మీయులను కోల్పోయి వేదనలో ఉన్న వారిని సైతం వీరు వదలకుండా... అంత్యక్రియలకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. కొందరు కాటికాపరులు ఒక్కో శవం దహనం చేయాలంటే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ డిమాండ్ చేస్తోన్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇంత జరుగుతోన్నా పంచాయతి అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోండటంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఇక  స్మశాన వాటికల్లో మౌలిక వసతి సౌకర్యాలను కల్పించడంలో పంచాయతి అధికారులు మీనమేషాలు లెక్కిస్తోన్నారని మండిపడుతోన్నారు.
 
కాటికాపరులకు వేతనాల చెల్లింపులు ఉండవా...?
స్మశాన వాటికల్లో శవాల అంత్యక్రియలు నిర్వహించే కాటికాపరులు దశాబ్దాల తరబడి ఎటువంటి వేతనాలకు నోచుకోవడం లేదు. దీంతో వారు మృతుల బంధువుల వద్ద నగదు వసూళ్లు చేసుకోవాల్సి వస్తోంది. ఒక్కో గ్రామంలో రెండు రోజులకు కనీసం ఒక్కరు చొప్పున చనిపోతోన్నారు. ఈ లెక్కన ఒక్కో గ్రామంలో నెలకు  15-నుంచి 30 మంది వరకూ చనిపోతోన్నారు. వారికి దహన సంస్కారాలు చేసేందుకు ఒక్కొక్కరికీ రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ డిమాండ్ చేస్తోన్నారు కాటికాపరులు. ఒక్కో కాటి కాపరి నెలకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకూ దహన సంస్కారాల నిమిత్తం వసూలు చేసుకుంటున్నారు. 
 
పంచాయతి లు బాధ్యత తీసుకోవాలి.
స్మశానాల నిర్వహణ విషయంలో ఆయా గ్రామ పంచాయతిలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్మశాన వాటికల నిర్వహణ నిమిత్తం  మృతుల బంధువుల వద్ద నుంచి కొద్ది మొత్తంలో ఫీజు వసూలు చేయడంతో పాటు చెల్లింపు నగదు రశీదును మృతుల బంధువులు కాటి కాపరికి చూపిస్తే శవానికి  దహన సంస్కారాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

ఇక కాటికాపరులకు గ్రామ పంచాయతి నెల వేతనం నిర్ణయించి ప్రతీ నెల క్రమం తప్పకుండా చెల్లించాలి. పంచాయతి చెల్లించే వేతనానికి ఇష్టపడిన వారినే కాటికాపరులుగా కొనసాగించాలి. లేకుంటే  స్మశాన వాటికల్లో పంచాయతి సిబ్బందిలోనే ఒకరిని నియమించి ఆధునిక  విద్యుత్ యంత్రాల సహాయంతో శవాలకు దహన సంస్కారాలు నిర్వహించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.