మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జులై 2025 (17:19 IST)

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

Chandrababu Naidu
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోకగజపతి రాజును గోవా గవర్నరుగా నియమించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గోవా గవర్నరుగా అశోక గజపతి రాజును గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
 
గవర్నర్‌గా నియమితులైన అశోక గజపతిరాజుకు అభినందలు తెలిపిన చంద్రబాబు.. గవర్నర్‌గా ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణమన్నారు. గవర్నర్‌గా అశోకను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అశోక గజపతి విజయవంతంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. 
 
అశోక గజపతిరాజుకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఆయనకు ఈ గౌరవాన్ని అందించిన రాష్ట్రపతి, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీ, నిబద్ధతతో గవర్నర్ పదవికి అశోక గజపతి వన్నె తెస్తారని విశ్వసిస్తున్నట్టు లోకేశ్ పేర్కొన్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా అశోక గజపతిరాజును శుభాకాంక్షలు తెలిపారు. 
 
గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు 
 
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం రెండు రాష్ట్రాలకు గవర్నర్‌‍లను, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్‍‌గా ప్రొఫెసర్ ఆషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాలను కేంద్రం నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఏపీలోని విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు. గతంలో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన, విజయనగరం రాజవంశానికి చెందిన ప్రముఖ వ్యక్తి. ఆయన గోవా గవర్నర్ నియమితులవడంపై టీడీపీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇక, హర్యానా గవర్నర్‌గా ఇప్పటివరకు బండారు దత్తాత్రేయ సేవలందిస్తూ వచ్చారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ ఆషింకుమార్ ఘోషను కేంద్రం నియమించింది. విద్యారంగంలో ప్రముఖుడైన ఘోష్, ఈ కీలక పదవిని చేపట్టనున్నారు. అలాగే, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా నియమితులయ్యారు.
 
తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లుగా పనిచేసిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో 20 మంది తెలుగు వారు గవర్నర్లుగా సేవలందించారు. వీరిలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కొణిజేటి రోశయ్య వంటి ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం.