శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వైఎస్. జగన్‌కు కేంద్రం పిలుపు.. ఒకే వేదికగా సీఎం - మాజీ సీఎం?

babu - jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి పిలుపువచ్చింది. ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది. దీంతో ఈ నెల 5వ తేదీన ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఇప్పటికే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా ఫోన్ చేసి హస్తినకు రావాల్సిందిగా కోరిన విషయం తెల్సిందే. 
 
జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన కేంద్రం దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సదస్సులు, సమావేశాలు నిర్వహించేంలా ప్లాన్ చేస్తుంది. ఇందులోభాగంగా, ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించే సదస్సుకు రావాలని సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబులకు కేంద్రం కబురు పంపింది. 
 
అలాగే, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాలు పంపించారు. జీ20 దేశాల సదస్సు తీరుతెన్నులు, అజెండాలపై ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తారు. 
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో బద్ధ విరోధులుగా ఉన్న జగన్, చంద్రబాబులు ఢిల్లీలో ఒకే వేదికపై కనిపించనున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సమావేశంలో వీరిద్దరికి ఆంధ్రప్రదేశ్ విభాగంలో పక్కపక్కనే సీట్లు కేటాయిస్తారా లేదా వేర్వేరుగా సీట్లు కేటాయిస్తారా అన్నది వేచి చూడాల్సివుంది.