మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శనివారం, 8 జూన్ 2019 (15:02 IST)

రోజాకి జగన్ చెవిలో పువ్వు... మంత్రుల ప్రమాణ స్వీకారానికి డుమ్మా...

ఆర్కే రోజాకి జగన్ మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కుతుందని అంతా భావించారు. అట్లాంటి ఇట్లాంటి పదవి కాదు.. ఏకంగా హోం మంత్రి పదవే ఆమెను వరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనూహ్యంగా రోజాతో పాటు సీనియర్ నాయకుడైన భూమన కరుణాకర్ రెడ్డికి కూడా షాకిచ్చేశారు. ఇంకా మరికొందరు సీనియర్ నాయకులకు మొండిచెయ్యి చూపించారు. ఈ జాబితాలోనే రోజా కూడా వున్నారు.
 
సామాజిక సమతుల్యాన్ని పాటించేందుకుగాను ఆమెకి చోటు దక్కలేదని వైసీపి అంటోంది. కానీ ఎలాగైనా ఆమెను తీసుకుని వుండాల్సిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆమెకి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఒకింత మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆమె మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. 
 
రోజాకి మంత్రి పదవి ఎందుకు రాలేదన్న విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు. నిజానికి రోజా పేరు మంత్రివర్గం లిస్టులో వున్నదనీ, చివరి నిమిషంలో ఆమె పేరు తొలగించాల్సి వచ్చిందని వైసీపి సీనియర్ నాయకులు చెపుతున్నారు. ఆమెకి మంత్రి పదవి రాకపోవడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి బుజ్జగించారు. ఐనప్పటికీ నూటికి నూరు శాతం పదవి వస్తుందన్న నమ్మకం వున్నప్పుడు రాకపోతే ఆవేదన మామూలే కదా. ఎనీవే... అంతా మంచికే. రోజాకి మరో రెండున్నరేళ్ల తర్వాత కీలక మంత్రి పదవి వస్తుందని ఆమె సన్నిహితులు ఆశిస్తున్నారు.