అయ్యో... బాబుకి కష్టాలు మొదలయ్యాయ్... ప్రజావేదిక వాళ్లక్కావాలట...
ఇది మామూలే. జనం అనుకునేవే. ఇంతకీ అదేంటయా అంటే... పాలనాధికారం వున్న పార్టీ ప్రతిపక్ష పార్టీ కోరే కోర్కెలను అంత తేలిగ్గా తీర్చదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే... ఉండవల్లిలో తను నివాసం వుంటున్న గృహానికి పక్కనే ప్రజావేదిక స్థలం ఖాళీగా వున్నదనీ, ఆ స్థలాన్ని తను అధికారికంగా వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విన్నవించారు. దీనిపై జగన్ స్పందించలేదు.
ఐతే ఇంతలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెనువెంటనే అదే ప్రజా వేదికను తమకే కేటాయించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే సీఎం జగన్ నిర్వహించే సమావేశాలకు ఇబ్బందిలేకుండా వుంటుందనీ, ట్రాఫిక్ సమస్యలు కూడా రావంటూ పేర్కొన్నారాయన. ఒకేసారి అటు తెదేపా, ఇటు వైసీపీ రెండూ కూడా ప్రజావేదికను తమకు కావాలంటే తమకే కావాలంటూ అభ్యర్థించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.