బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:44 IST)

సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రాష్ట్రంలోని కౌలు రైతులకు ఋణాలు మంజూరు చేయడంలో సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో రాష్ట్రంలోని గ్రామీణ సహకార క్రెడిట్ ఇనిస్టిట్యూట్ల పనితీరుపై రాష్ట్రస్థాయిలో మొదటి హైలెవెల్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కౌలు రైతులకు ఋణాలు అందించేందుకు రూపొందించిన చట్టాన్ని అనుసరించి భూమి యజమానితో సంబంధం లేకుండా నేరుగా ఆయా కౌలు రైతులకు ఋణ సౌకర్యం కల్పించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఆప్కాబ్, డిసిసిబి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వంటి సహకార బ్యాంకులు కీలకపాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ప్రస్తుతం కౌలు రైతులకు అనుకున్నంత స్థాయిలో ఋణాలు అందడం లేదని కావున కౌలు రైతులందరికీ సకాలంలో ఋణాలు అందించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, సహకార శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆదేశించారు.

అదే విధంగా కౌలు  రైతుల చట్టాన్ని అనుసరించి భూమి యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు నేరుగా ఋణాలు మంజూరు చేసే అంశంపై గ్రామ స్థాయిలో గోడపత్రికలు, కరపత్రాలు, బ్యానర్లు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ఆప్కాబ్, డిసిసిబి, నాబార్డు వంటి సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు.

 
రాష్ట్రంలోని ఉత్తమ పనితీరు కనపరుస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను గుర్తించి వాటిని కంప్యూటరీకరించి డిసిసిబి, ఆప్కాబ్ తో అనుసంధానించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. అదేవిధంగా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు సహకార పరపతి సంఘాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

రైతు బంధు పథకం కింద రైతులకు ట్రాక్టర్లు అందించే కార్యక్రమంపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ముఖ్యంగా వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన యువతకు ఎరువులు అమ్మకాల్లో భాగస్వామ్యం కల్పించాలని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగు అవడంతోపాటు రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేసేందుకు వీలువుతుందని కావున ఆదిశగా చర్యల చేపట్టాలని సిఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు.

నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.సెల్వరాజ్ సమావేశపు అజెండా వివరాలను తెలయజేస్తూ కౌలు రైతులకు ఋణాలు, కార్పొరేట్ గవర్నెన్స్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. 
ఆప్ కాబ్ ఎండి కె.తులసీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది కౌలు రైతులకు 1200కోట్ల రూ.లు ఋణాలు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం కాగా ఆదిశగా బ్యాంకులు, సహకార బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో 2 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుండగా వాటిలో 1300 సంఘాలు లాభాల్లో నడుస్తున్నాయని, అలాగే ఆప్ కాబ్, డిసిసిబిలు నిరంతరం లాభాల్లో నడుస్తున్నాయని వివరించారు. ఇంకా ఈ సమావేశంలో గ్రామీణ పరపతి సంస్థలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

సమావేశంలో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్ జి.వాణీమోహన్, ఆర్బీఐ జనరల్ మేనేజర్ జోగి మేఘనాథ్, నాబార్డు జనరల్ మేనేజర్ ప్రభాకర్ బెహ్రా, ఆర్బీఐ మేనేజర్ ఉదయ్ కృష్ణ, నాబార్డు డిజియం బి.రమేశ్ బాబు, ఎజియం టి.విజయ్ తదితరులు పాల్గొన్నారు.