శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (18:27 IST)

ఏపీలో నమోదయ్యే కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చినవే... సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కరోనా కేసులన్ని ఢిల్లీలోని మర్కజ్ సదస్సుకెళ్లి వచ్చినవారి నుంచి వచ్చినవేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పైగా, కరోనా వైరస్ సోకినంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
సీఎం జగన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గత రెండు రోజుల వ్యవధిలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమన్నారు. కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని.. ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారికే పాజిటివ్‌ వచ్చిందని గుర్తుచేశారు. 
 
ఈ ఢిల్లీ సదస్సుకు మన రాష్ట్రం నుంచి 1,085 మంది వెళ్లి వచ్చారని, వీరిలో మొత్తం 585 మందికి పరీక్షలు చేశాం, 70 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21 మంది కోసం గాలింపు చేపట్టామన్నారు. 104కు ఫోన్‌ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలన్నారు. 
 
కరోనా వైరస్‌ జ్వరం, ఫ్లూ లాంటిదే, ఎవరూ భయపడొద్దన్నారు. వృద్ధులు, డయాబెటిస్‌, ఇతర సమస్యలున్నవారికి తీవ్రంగా ఉంటుందన్నారు. కరోనా పట్ల అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దన్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుందని.. విదేశాల్లో దేశాధినేతలకు కూడా కరోనా సోకింది, నయమైందన్నారు.