శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (15:24 IST)

కేంద్ర రాష్ట్రాల మధ్య బ్రోకర్‌గా ఏపీ గవర్నర్ : సీపీఐ నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏపీ గవర్నర్ ఒక బ్రోకర్‌గా మారిపోయారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. గవర్నరుగా ఉన్న హరిచందన్ వంటి వ్యక్తుల వల్ల మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పోతోందని నారాయణ అన్నారు. 
 
ఆయన మంగళవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హెడ్ క్లర్క్‌గా మారిపోయారని మండిపడ్డారు. అంతటితో ఆగని నారాయణ కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఓ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా, ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన హరిచందన్‌కు కేంద్ర ప్రభుత్వం ఏపీ గవర్నరుగా నియమించింది. అప్పటి నుంచి ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన విధులను ప్రశాంతంగా చేసుకుంటూ పోతున్నారు. 
 
అయితే, ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకునే అనేక వివాదాస్పద నిర్ణయాలకు గవర్నర్ కేంద్రబిందువుగా మారారు. ఫలితంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.