అలకపాన్పుపై ఎమ్మెల్యే రోజా.. విజయసాయి బుజ్జగింపు... ఆర్టీసీ ఛైర్మన్‌గా...
ఖచ్చితంగా తనకు మంత్రిపదవి దక్కుతుందని గట్టిగా భావించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంతో ఆమె ఖంగుతిన్నారు. దీంతో శనివారం ఉదయం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. పైగా, ఆమె అలకపాన్పుఎక్కి, కనిపించకుండా పోయారు.
దీంతో రోజాను బుజ్జగించేందుకు స్వయంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి బుజ్జగించారు. చివరకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇస్తామని హామీ ఇవ్వడంతో రోజా శాంతించినట్టు సమాచారం.
అయితే, రోజా ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు ఇలాంటి నామినేటెడ్ పదవులు చేపట్టడంలో రాజ్యాంగపరమైన అడ్డంకులను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి కూడా రోజా ముందు ఓ ఆప్షన్‌లా ఉంచారని ప్రచారం జరుగుతోంది. మరి రోజా భవితవ్యం ఏ పదవితో ముడిపడి ఉందో కాలమే సమాధానం చెప్పాల్సివుంది.