శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:54 IST)

రేప‌టి నుంచి పేద కుటుంబాల‌కు రూ.1000 పంపిణీ : డిప్యూటీ సిఎం పుష్ప‌ శ్రీ‌వాణి

క‌రోనా నియంత్ర‌ణ‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేసిన నేప‌థ్యంలో తెల్ల‌రేష‌న్ కార్డు క‌లిగిఉన్న ప్ర‌తి పేద కుటుంబానికి ప్ర‌భుత్వం రూ.1000 అంద‌జేయ‌నుంద‌ని, రేప‌టి నుంచి (శ‌నివారం) న‌గ‌దు పంపిణీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి వెల్ల‌డించారు.

రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, లాక్‌డౌన్ కార‌ణంగా పేద ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. రైతు బ‌జార్ల వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా విజ‌య‌న‌గ‌రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కూర‌గాయ‌ల మార్కెట్‌ను ఆమె శుక్ర‌వారం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా కొనుగోలుదారుల‌తో మాట్లాడి కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌పై వాక‌బు చేశారు. అనంత‌రం నెల్లిమ‌ర్ల‌లోని మిమ్స్ ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన క‌రోనా ఐసోలేష‌న్ వార్డును మంత్రి సంద‌ర్శించారు. వెంటిలేట‌ర్లు, మందులు, ఇత‌ర ప‌రిక‌రాలు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌ను ఆరా తీశారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింద‌ని, అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బంది ప‌డ‌కుండా ప్ర‌భుత్వం అన్నిచ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

కాగా ఉచిత రేష‌న్‌ను గ‌త నెల 29 నుంచి ప్రారంభించామ‌ని, దాదాపు 65 శాతానికి పైగా పంపిణీ పూర్తి అయింద‌ని తెలిపారు.