శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 30 మార్చి 2020 (20:33 IST)

బియ్యం, కందిపప్పు పంపిణీతో వయోవృద్ధులు, చిన్నారుల కడుపు చల్లగా: డాక్టర్ కృతికా శుక్లా

కరోనా లాక్‌డౌన్ నేపధ్యంలో వృద్ధాశ్రమాలు, బాలల కేంద్రాలలో ఉన్నవారి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ పలువురికి గుప్పెడన్నం పెడుతుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశుసంక్షేమ శాఖ ఈ మేరకు జిఓ నెంబర్ 58 జారీ చేయగా 13 జిల్లాలలో 729 బాలల సదనాలు ఈ ఆదేశాల వల్ల లబ్ది పొందనున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశుసంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. 
 
ప్రభుత్వేతర సంస్థల నేతృత్వంలో ఈ బాలల సదనాలు నడుస్తుండగా, 24,695 మంది చిన్నారులు ఈ కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారన్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో వీరిలో 21,725 మందిని వారి తల్లి దండ్రులు, సంరక్షకులకు అప్పగించగా, 2,944 మంది అనాధలు అయా సంస్థలలోనే ఉన్నారని కృతికా శుక్లా వివరించారు. ప్రస్తుతం బాల సదనాలలో ఉన్న ప్రతి చిన్నారికి 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ చేయనున్నామని, ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు ఆ పనులలో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేసారు.
 
పౌరసరఫరాల శాఖ సమన్వయంతో రానున్న రెండు రోజుల్లో బియ్యం, పప్పు వారికి చేరేలా చూస్తామన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 87 వయోవృద్ధుల కేంద్రాలు సేవలు అందిస్తుండగా, వాటిలో దాదాపు 2000 మంది వయోవృద్ధులు సేద తీరుతున్నారని వారు సైతం ఈ కార్యక్రమం ద్వారా స్వాంతన పొందుతారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
 
వృద్ధాశ్రమాలు, బాలల సదనాలు కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ తరహా సంస్ధలు అన్నింటిలో ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం విదితమే.