శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (20:42 IST)

యస్ బ్యాంక్ మీద ఆర్‌బీఐ మారటోరియం: ఇప్పుడు ఏమవుతుంది? ఖాతాదారుల పరిస్థితి ఏమిటి?

యస్ బ్యాంక్ వద్ద ఖాతాదారులు
భారతదేశపు అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో అయిదో స్థానంలో ఉన్న యస్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించటంతో పాటు.. వినియోగదారులు రూ. 50,000 మొత్తానికి మించి నగదు విత్‌డ్రా చేయకుండా పరిమితి విధించటం.. కస్టమర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

 
గురువారం రాత్రి ఈ ప్రకటన రావటంతో ముంబయిలో బ్యాంక్ ఏటీఎంల ముందు జనం పెద్ద ఎత్తున వరుసకట్టి కనిపిస్తున్నారు. ''అసలు భద్రత లేదు. ఏం జరుగుతోంది? మన బ్యాంకులు చాలా భద్రమైనవని భారతీయులుగా మేం భావించాం'' అని బ్యాంక్ ఏటీఎం వద్ద క్యూలో నిల్చున్న నీటా చాబ్రియా అనే కస్టమర్ బీబీసీతో అన్నారు.

 
''బ్యాంకు డిజిటల్ సేవలను కూడా మూసివేయటం చాలా ఆందోళన కలిగిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ పనిచేయటం లేదు. నేను నా తండ్రి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది'' అని తెలిపారు. ''నేను ఉదయం 8:15 గంటల నుంచి ఇక్కడ ఉన్నాను. వాళ్లు మాకు ఒక టోకెన్ ఇచ్చి మధ్యాహ్నం 3:00 గంటల వరకూ వేచి ఉండాలని చెప్పారు. మేనేజర్లలో ఏ ఒక్కరూ బయటకు రావటం లేదు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదు'' అని వినియోగదారుడైన ఓ సీనియర్ సిటిజన్ హరీష్ చావ్లా వాపోయారు.

 
బ్యాంకు మీద విధించిన మారటోరియాన్ని 30 రోజుల తర్వాత తొలగించేవరకూ డిపాజిటర్ల మీద ఆ ప్రభావం ఉంటుందని, బ్యాంకు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ''బ్యాంకు మొత్తం రిటైల్ డిపాజిట్ రూ. 1 లక్ష కోట్లకు పైగా ఉంది. ఇంత భారీ మొత్తం ఉన్న బ్యాంకు విఫలమవటానికి వీలు లేదు. పరిస్థితి విషమించకుండా నియంత్రణ సంస్థలు చర్యలు చేపడతాయి'' అని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థకు చెందిన బ్యాంకింగ్ విశ్లేషకుడు జైకిషన్ పార్మార్ పేర్కొన్నారు.

 
అయితే తక్షణ ప్రభావం.. యస్ బ్యాంక్ రుణాలలో పెట్టుబడులు పెట్టిన మూచ్యువల్ ఫండ్స్ మీద పడుతుందని.. ఎందుకంటే ఆ పెట్టుబడుల విలువను నేరుగా రద్దు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు నష్టాలు భరిస్తారని తెలిపారు.

 
అయితే.. ఈ బ్యాంకు ద్వారా వర్కింగ్ కేపిటల్ (నిర్వహణ పెట్టుబడులు) నడుపుతున్న, అకౌంట్ల ద్వారా ఈఎంఐ చెల్లింపులు చేస్తున్న వినియోగదారుల మీద ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందనే అంశం మీద ఇంకా స్పష్టత లేదు. దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యస్ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టే విషయాన్ని పరిశీలించటానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపుతూ రాత్రి పొద్దు పోయిన తర్వా నోటిఫికేషన్ ఇచ్చింది.

 
''బ్యాంకులో వాటా కొనటం ద్వారా మళ్లీ పెట్టుబడులు సమకూర్చటం కానీ, లేకపోతే విలీనం చేయటం కానీ జరుగుతుంది. ఈ బ్యాంక్ స్వతంత్ర సంస్థగా మనుగడ సాగించటం మాత్రం అసాధ్యం'' అని స్వతంత్ర ఆర్థిక విశ్లేషకుడు మహేంద్ర హజారీ పేర్కొన్నారు.

 
''మారటోరియం ప్రకటించిన మరుక్షణం, విత్‌డ్రాయల్స్ మీద పరిమితులు విధించిన తక్షణం.. ఆ బ్యాంకు డిపాజిటర్లను కోల్పోతుంది. ఎందుకంటే బ్యాంక్ మీద వారికి నమ్మకం పోతుంది. ఇప్పుడున్న ఏకైక మార్గం.. దానిని మరొక బ్యాంకు విలీనం చేసుకోవటం మాత్రమే'' అని ఆయన వివరించారు.

 
ఇది భారతదేశంలో గల ఇండస్‌ల్యాండ్ బ్యాంక్ వంటి ఇతర ప్రైవేట్ బ్యాంకుల మీద విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుందని హజరీ చెప్పారు. ఈ ప్రకటన విని బ్యాంకు ఉద్యోగులు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ''నిన్న రాత్రి ఈ వార్త విని విస్తుపోయాను. మాలో ఈ బ్యాంకులో ఈఎస్ఓపీలు (ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్లు) ఉన్న వాళ్లు భారీ మొత్తంలో నష్టపోయారు'' అని ఒక ఉద్యోగి తన పేరు వెల్లడించవద్దని కోరుతూ చెప్పారు.

 
యస్ బ్యాంక్ షేర్లు ట్రేడింగ్‌లో 40 శాతం పైగా నష్టపోయాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గన్, ఈ బ్యాంకు షేరు టార్గెట్ ధరను ఒక్క రూపాయికి తగ్గించింది. భారతదేశంలో కేవలం గత ఆరు నెలల కాలంలో మారటోరియం కింద పెట్టిన రెండో బ్యాంక్ యస్ బ్యాంక్. పీఎంసీ బ్యాంక్‌లో 60 కోట్ల డాలర్ల అవినీతి ఆరోపణలను ఆర్‌బీఐ వెలికితీయటంతో 2019 నవంబర్‌లో ఆ బ్యాంక్ మీద కూడా ఇదే తరహా ఆంక్షలు విధించారు.

 
యస్ బ్యాంక్‌కు సంబంధించి అనేక పరిపాలనా అంశాలతో పాటు, చెడ్డ రుణాల గురించి సరిగా నివేదించటం లేదన్న విషయంలో ఆర్‌బీఐ నిశిత దృష్టి కేంద్రీకరించింది. దేశంలో ఆర్ధిక మందగమనంతో ప్రభావితమైన రియల్ ఎస్టేట్, టెలికాం రంగాలకు భారీగా నిధులు సమకూర్చిన ఈ బ్యాంక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.