బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (18:04 IST)

డాక్ట‌ర్ స‌రిత కాకానికి ఇండియా ప్రైమ్ ఉమెన్ ఐకాన్ అవార్డు

విజ‌య‌వాడ‌లో యువ వైద్యురాలు స‌రిత కాకానికి జాతీయ స్థాయి అవార్డు ల‌భించింది. మధుమేహంపై అవగాహన కల్పించడంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా విజయవాడకు చెందిన డాక్టర్ సరిత కాకానికి, ఉమెన్ ఐకాన్ అవార్డు ల‌భించింది. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న శైలిపై విస్తృతంగా స్ట‌డీ చేసినందుకు డాక్ట‌ర్ స‌రిత ఈ పుర‌స్కారం పొందారు. ఫాక్స్ క్లూస్ సంస్థ‌ “ఇండియా ప్రైమ్ ఉమెన్ ఐకాన్ అవార్డ్ 2021”/ టాప్ 100 ఉమెన్ ఐకాన్ అవార్డుతో డాక్ట‌ర్ స‌రిత కాకానిని సత్కరించారు. 
 
గత 10 సంవత్సరాలుగా, డాక్టర్ సరిత టెలివిజన్ షోలు, అవగాహన కోసం నడకలు, పాఠశాల, కళాశాల స్థాయిలలో సెమినార్లు నిర్వ‌హిస్తున్నారు. అనేక సామాజిక మాధ్యమాల ద్వారా వేల మందికి మధుమేహంపై అవగాహన కల్పించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆమె అనేక ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ , డిటెక్షన్ క్యాంపులను నిర్వహించారు. ఈ రంగంలో ఆమె చేసిన కృషికి,  2016 సంవత్సరంలో డయాబెటిస్ ఇండియా నుండి “డయాబెటిస్ అవేర్నెస్ ఇనిషియేటివ్ అవార్డ్” అందుకున్నారు. 
 
టాప్ 100 ఉమెన్ ఐకాన్ అవార్డును అందుకున్న సందర్భంగా, డాక్టర్ సరిత మాట్లాడుతూ, ఈ అవార్డు డయాబెటిస్ కేర్ ఫిజిషియన్‌గా తన బాధ్యతను మరింత పెంచిందని, డయాబెటిస్‌కు చికిత్స చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి , మధుమేహ నివారణపై అవగాహన కల్పించడంలో ఎంతో కృషి చెయ్యాల్సి ఉందని అన్నారు. డాక్టర్ సరిత ప్రస్తుతం విజయవాడలోని ఐ.ఎం.ఎ.  మహిళా విభాగం కార్యదర్శిగా ఉంటూ డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2016-2019 ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్, సిఐఐ హెల్త్ & వెల్ బీయింగ్ చాప్టర్‌కు కన్వీనర్‌గా పనిచేశారు.