సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మే 2024 (17:15 IST)

బటన్ నొక్కి చాలా రోజులైంది.. డబ్బులు ఎందుకు జమ చేయలేదు : ఈసీ ప్రశ్న

election commission
ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నుంచి సూటి ప్రశ్న ఒకటి ఎదురైంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా, నగదు బదిలీ పథకాలై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బటన్ నొక్కి చాలా రోజులైంది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు ఎందుకు జమ చేయలేకపోయారని ప్రశ్నించింది. జనవరి 24వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. వారాల పాటు ఆపి ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని లేఖలో ఈసీ పేర్కొంది. పోలింగ్ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది. 
 
ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య ఉన్న కాల వ్యవధి ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. నిధుల జమకు ఏప్రిల్, మే నెలల్లో కోడ్ ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా అని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమై ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలంటూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం చెప్పాలంటూ ఈసీ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది.