గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 20 నవంబరు 2021 (18:51 IST)

దేవుడా కాపాడు, దీనంగా తిరుపతివాసులు

తిరుపతి.. ఇప్పుడు ఈ పేరు వింటనే జనం ఆలోచనలో పడ్డారు. వరద భీభత్సంతో ఈ ప్రాంతం మొత్తం అస్తవ్యస్థంగా మారింది. ఎటు చూసినా వర్షపునీరే. ఇళ్ళలో చేరిన వర్షపు నీరు అంధకారంలో కుటుంబాలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా రాని పరిస్థితి.

 
తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక స్థానికులు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. ఇప్పటికీ పలు ప్రాంతాలు జలదిగ్భంధంలోనే ఉంది. వైకుంఠపురం, సరస్వతినగర్, శ్రీక్రిష్ణనగర్‌లు వర్షపునీటితో మునిగిపోయాయి.

 
చిన్నపిల్లలు, వృద్ధులతో ఇక్కడివారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయారు స్థానికులు. రోడ్లపై వరద నీరు పొంగి పొర్లుతోంది. మ్యాన్ హోల్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. రోడ్లపై గుంతల మధ్య వాహనాలను నడుపుతూ ప్రమాదానికి గురవుతున్నారు స్థానికులు.

 
ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు తిరుపతి. మొత్తం 20 డివిజన్లలో ఇదే పరిస్థితి. ప్రజాప్రతినిధులు వచ్చి పరామర్సించి వెళుతున్నారు గానీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

 
సమీక్షలు, సమావేశాలు పక్కనబెట్టి తమ గోడును పట్టించుకోండి అంటూ ప్రాధేయపడుతున్నారు. వర్షపునీరు ఇళ్ళలోకి రావడం.. విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓట్లు అడిగే దానికి వచ్చే ప్రజాప్రతినిధులు మా గోడు మీకు పట్టదా అంటూ ప్రశ్నిస్తున్నారు.