మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (15:15 IST)

ఫించన్లు… టెన్షన్లు… అర్హులు - అనర్హుల పేరుతో జగన్ సర్కారు నయా జాబితా?

ఫింఛన్లు తీసుకుంటున్న వారిలో కొంతమందిని అనర్హుల పేరుతో జాబితా నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు రెండు జాబితాలు చేరాయి. ఆ జాబితాలో ఒకటి అర్హుల జాబితా, మరొకటి పెండింగ్‌లో ఉంచిన జాబితా. ఎవరి పేర్లైతే అర్హుల జాబితాలో ఉన్నాయో వారంతా జనవరి 28వ తారీఖు లోపు అర్హత పత్రాలు స్పమర్పించాలి. జనవరి 29వ తేదీన తొలి జాబితాను విడుదలచేసే అవకాశం ఉంది. గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో, ఫింఛన్లు తీసుకుంటున్న వారిలో ఎంత మంది పేర్లను తొలగించబోతున్నారు అనే సమాచారం అధికారులు వెల్లడించటం లేదు.
 
అనర్హుల పేరిట కొంతమంది పేర్లు తొలగించేందుకు రంగం సిద్ధమైందని ఇందుకు సంబందించిన జాబితాలు సచివాలయాలకు చేరాయి. మొదటి జాబితాలో పేర్లున్న వారంతా.. అర్హులు కాదని… అర్హతకు సంబందించిన పత్రాలను మళ్లీ సమర్పించకపోతే అనర్హత వేటు వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అర్హుల జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే.. అభ్యంతరాలు వ్యక్తం చేయండి.. అని అధికారులు ఫింఛన్లు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి చెబుతున్నారట. చంద్రబాబు హయాంలో ఇచ్చిన పేర్లలో అనర్హుల పేరిట సగం మందికి పైగా తొలగించేందుకు రంగం సిద్ధమైందని, గ్రామ, పట్టణ తెదేపా నాయకులు బాహాటంగానే చెబుతున్నారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక్కొక్క జిల్లా లక్ష మందికి పైగా తొలగించినా ఆశ్చర్యపడక్కర్లేదని టిడిపి నేతలు అంటున్నారు. అనర్హులను మాత్రమే జాబితా నుండి తొలగించాం. అర్హులు ఎవరినీ తొలగించలేదు అని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటి వద్దకే ఫించను ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో జనవరి మాసాంతంలోపే అర్హులైన ఫించను దారుల జాబితా సచివాలయాలకు చేరతాయి. ఏది ఏమైనా జనవరి మాసాంతం లోపు ఏయే జిల్లాలలో ఎన్నెన్ని ఫింఛన్లు తొలగించారు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడ తమ ఫించన్లు నిలిపి వేస్తారో అని అర్హత ఉన్నవారు.. అర్హత లేని వారు కూడా ఉత్కంఠగా కనిపిస్తున్నారు.