శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:40 IST)

గుంటూరులో శాడిస్టు వడ్డీవ్యాపారి.. ‘స్పందన’ ఫిర్యాదుతో అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల వేధింపులు మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని కొత్తపేటలో వడ్డీ వ్యాపారం ముసుగులో సామాన్యులను వేధించుకుతింటున్న రత్నారెడ్డి అనే వ్యాపారిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఏపీ సీఎం జగన్ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇటీవల‘స్పందన’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది ప్రజలు రత్నారెడ్డి వేధింపులపై పోలీసుల ముందు వాపోయారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కొత్తపేట సీఐ సుధాకర్ రెడ్డి.. సుధాకర్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రత్నారెడ్డిని అరెస్ట్ చేశారు. 
 
అనంతరం రత్నారెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విస్తుపోయారు. అతని ఆఫీసు నుంచి 225 ఏటీఎం కార్డులు, రూ.1.40 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 పాస్ పుస్తకాలు, 102 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 293 ఖాళీ చెక్కులు, 8 పట్టాదారు పాస్ పుస్తకాలు, 20 దస్తావేజులు రత్నారెడ్డి ఆఫీసులో లభించాయి.