సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (19:18 IST)

#73YearsOldWomanPregnant బామ్మ వయసులో అమ్మ..(Video)

ఓ మహిళ బామ్మ వయసులో అమ్మ అయింది. అదీ కూడా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఫలితంగా అమ్మకావాలన్న ఐదు దశాబ్దాల కల 73 యేళ్ళ వయసులో నెరవేర్చుకుంది. ఈ అరుదైన దృశ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962, మార్చి 22న వివాహమైంది. వివాహమై సంవత్సరాలు గడిచిపోతున్నా... పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. 
 
కాగా తల్లి కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ తాను కూడా ఐవీఎఫ్ పద్దతిని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. గడిచిన నవంబరులో గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌ను ఆశ్రయించారు. మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. 
 
అయితే, మంగాయమ్మ మెనోపాజ్ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని, మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఐవీఎఫ్ పద్ధతిలో చికిత్సను ప్రారంభించారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది. అలా తొమ్మిది నెలల తర్వాత ఆమె గురువారం కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
మంగాయమ్మకు గుంటూరులోని అహల్యా ఆస్పత్రిలో డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. పెళ్లయిన 57 ఏళ్ల తర్వాత మంగాయమ్మ గర్భం దాల్చింది. గతంలో 70 ఏళ్లకు ప్రసవం ప్రపంచ రికార్డుగా ఉంది. కాగా ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ప్రసవం ద్వారా అరుదైన రికార్డు అని వైద్యులు చెబుతున్నారు.