శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (11:54 IST)

గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ ... ఆమెకు కరోనా అని తేలడంతో...

గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో ఓ గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు, ఇతర సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పెదకాకానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం మూడు రోజుల క్రితం  గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. మంగళవారం ఆమెకు పురుడుపోశారు. సహజ ప్రసవం కాకపోవడంతో సిజేరియన్‌ చేయాల్సి వచ్చింది. 
 
అయితే, ఆమెకు ప్రసవానికి ముందే కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా, ఈ పరీక్షా ఫలితాలు గురువారం వచ్చాయి. ఇందులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో మంగళవారం లేబర్‌ రూమ్‌లో విధుల్లో ఉన్న 8 మంది వైద్యులు, జూనియర్‌ డాక్టర్లతో పాటు ఇద్దరు స్టాఫ్‌ నర్సులు ఆందోళనకు గురయ్యారు. 
 
అనంతరం వారు క్వారంటైన్‌కు వెళతామని సూపరింటెండెంట్‌కు చెప్పగా, ఆయన అంగీకరించారు. ముందస్తు జాగ్రత్తగా వీరందరికీ కరోనా వైద్య పరీక్షలు జరిపారు. రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.