బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2024 (08:58 IST)

మరింతగా బలపడిన అల్పపీడనం.. నేడు ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు

rain
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడివున్న అల్పపీడనం మరింతగా బలపడింది. దీని ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 
 
ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింతగా బలపడుతుందని, పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం ఉందని ఏపీఎస్జీఎంఏ వివరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో డిసెంబరు 18వ తేదీ బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
 
ముఖ్యంగా, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని... శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్జీఎంఏ పేర్కొంది.