శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 25 ఏప్రియల్ 2018 (13:00 IST)

టిటిడికి మొట్టికాయలు వేసిన హైకోర్టు.. ఎందుకో తెలుసా?

వెంకన్న సన్నిధిలో ఏం జరిగినా కోట్లలో వ్యవహారమే. అంతులేని స్వామి వారి ఆస్తులను కాపాడటంలో టిటిడి తీసుకునే నిర్ణయాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. అందరితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఏకపక్షంగా తీసుకోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయంట

వెంకన్న సన్నిధిలో ఏం జరిగినా కోట్లలో వ్యవహారమే. అంతులేని స్వామి వారి ఆస్తులను కాపాడటంలో టిటిడి తీసుకునే నిర్ణయాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. అందరితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఏకపక్షంగా తీసుకోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయంటున్నారు భక్తులు. తాజాగా ప్రైవేటు బ్యాంకుల్లో టిటిడికి సంబంధించిన సొమ్మును డిపాజిట్ చేయడం పట్ల అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కోర్టు నుంచి కూడా టిటిడికి నోటీసులు అందాయి. అసలు ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనే నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారు. ఎందుకు అది తరచూ వివాదాస్పదమవుతోంది? 
 
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్నకు ఎంతో భక్తితో కానుకలను సమర్పిస్తుంటారు. ప్రతిరోజు కోటి రూపాలయకు పైగా శ్రీవారి హుండీ ఆదాయం వస్తుంటుంది. స్వామివారికి వేల కోట్ల రూపాయల ఆస్తి ఉందనేది అందరికీ తెలిసిందే. స్వామివారికి మ్రొక్కులు సమర్పిస్తే ఎంతో మంచిదన్నది భక్తుల నమ్మకం. అందుకే భక్తులు స్వామివారికి నిలువుదోపిడీగా సమర్పిస్తుంటారు. భక్తులు సమర్పించే నగదును టిటిడి ఉన్నతాధికారులు ఇప్పటి వరకు జాతీయ బ్యాంకులలోనే భద్రపరుస్తున్నారు. అయితే తాజాగా వెయ్యి కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
మార్చి 20వ తేదీ శ్రీవారి ఫిక్స్ డిపాజిట్లలో 4వేల కోట్ల రూపాయలకు సంబంధించి గడువు పూర్తి కావడంతో టిటిడి ఉన్నతాధికారులు డబ్బును డ్రా చేసి 3వేల రూపాయలను ఆంధ్రాబ్యాంకు లో డిపాజిట్ చేశారు. మరో వెయ్యి రూపాయలను ప్రైవేటు బ్యాంకయిన ఇండస్ బ్యాంకులో డిపాజిట్  చేశారు. దీంతో హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. స్వామివారి డబ్బుకు జవాబుదారితనంగా ఉండాల్సిన టిటిడి ఉన్నతాధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డాయి. తిరుపతికి చెందిన రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు టిటిడి ఉన్నతాధికారుల తీరుపై మండిపడింది. 
 
టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాటు, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్సికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు బ్యాంకులో వెయ్యి కోట్ల రూపాయల శ్రీవారి నిధులను జమ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై సమగ్ర సమాచారాన్ని కోర్టుకు అందించాలని ఆదేశించారు. స్వామి వారి నిధులు భద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళినట్లు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు బ్యాంకులో ఉన్న వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను వెంటనే రద్దు చేసి ఆ డబ్బును తిరిగి జాతీయ బ్యాంకులోనే జమ చేసేంత వరకు న్యాయపరమైన పోరాటం చేస్తామంటున్నారు.