శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 16 అక్టోబరు 2018 (15:46 IST)

ఇక అర్థరాత్రి వరకు రెస్టారెంట్లు... పర్యాటక ప్రోత్సాహం కోసం...

పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. పర్యాటక శాఖ గత కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా కార్మిక శాఖ ఇచ్చిన ఈ జీవో పర్యాటక రంగానికి కొత్త ఊపిరులను అందిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రెస్టారెంట్స్, పుడ్ కోర్ట్స్ నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమయపాలన నిబంధనకు ఇచ్చిన మినహాయింపు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 
 
ప్రస్తుతం వీటి పని వేళలు రాత్రి 10.30 గంటల వరకే పరిమితం కాగా ఆ సమయాన్ని 12 గంటల వరకు పొడిగిస్తూ కార్మిక శాఖ పక్షాన ప్రభుత్వం సోమవారం జీఓ నంబర్ 25ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ వినతి మేరకు రాష్ట్ర పర్యాటక, భాష సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గత నెలలో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి సమయాన్ని పొడిగించవలసిన అవసరాన్ని వివరించారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సైతం ఈ విషయంపై చర్చించారు. పర్యాటక రంగ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కూడా సానుకూలంగా స్పందించడంతో తాజా జీఓ వెలువడిందని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సాధికార సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ నిర్వహణ సంచాలకులు హిమాన్షు శుక్లా ఈ సందర్భంగా తెలిపారు. రోజువారీ సమయం పెంపు నిర్ణయం వల్ల ఆహార రంగంలో వ్యాపార అవకాశాలు పెరుగుతాయని, ఇది పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుతుందన్నారు. 
 
పనిగంటలు పెరగటం వల్ల రెస్టారెంట్లు, హోటల్స్ నిర్వాహకులకు అదనంగా కార్మిక శక్తి అవసరం అవుతుందని, ఇది కార్మికుల ఆదాయం పెరిగేందుకు దోహద పడుతుందని శుక్లా పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు కనీసం 10శాతం పెరుగు తాయని ఇది రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇప్పటికే స్టార్ హోటల్స్ కు ఈ తరహా వెసులు బాటు ఉన్నప్పటికీ తాజా ఉత్తర్వుల ప్రకారం ఆహార విక్రయ సంస్థలు అందరికీ అవకాశం లభించినట్లు అయ్యిందని శుక్లా వివరించారు. మరోవైపు ఈ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్న ఆహార వ్యాపార నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక శాఖ తో తగిన సమన్వయం సాధించటం ద్వారా తమ వినతి త్వరిత గతిన పరిష్కరించారని, ఈ నేపధ్యంలో తాము పర్యాటక కార్యదర్శి మీనా, ఏపీటీఏ సీఈఓ శుక్లాకు అభినందనలు తెలుపుతున్నామన్నారు.