శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (18:35 IST)

జాతీయ యువజనోత్సవాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వంద మంది

జాతీయ యువజన మహోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ నుండి వంద మంది కళాకారులకు అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర యువజన సేవల శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలకు దేశవ్యాప్త ప్రచారం కల్పించేలా తెలుగునాట ప్రాచుర్యం పొందిన విభిన్నకళలను ఈ మహోత్సవాలలో ప్రదర్శింప చేస్తామన్నారు.  
 
 
జాతీయ యువజనోత్సవాలకు సంబంధించి రాష్ట్ర స్ధాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం విజయవాడ యువజన సేవల శాఖ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర స్ధాయి అధికారులు విజయవాడ కార్యాలయం నుండి పాల్గొనగా, జిల్లా స్ధాయి అధికారులు వెబినార్ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ పాండిచ్చేరీ వేదికగా జనవరి 12 నుండి 16వ తేదీ వరకు యువజనోత్సవాలు జరగనుండగా, ఈ సంవత్సరం వినూత్నంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
 
 
ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి యుద్ధకళలుగా ప్రసిద్ది పొందిన కర్రసాము, కత్తిసాము సాధకులతో పాటు, కబాడ్డీ , కోకో క్రీడాకారులు, చేతి వృతి, చేనేత కళాకారులను కూడా పంపాలని నిర్ణయించామన్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ప్రసిద్ది చెందిన జానపద నృత్య బృందాలతో పాటు తోలుబొమ్మలాట వంటి పురాతన కళ ప్రదర్శనలను కూడా పాండిచ్ఛేరీ పంపుతున్నామన్నారు. మరో వైపు రాష్ట్ర స్దాయి కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారనని నాగరాణి పేర్కొన్నారు. జనవరి 12వ తేదీన విజయవాడలో రాష్ట్ర యువజనోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.
 
 
 స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్దాయిలో యువత, విద్యార్ధులకు విభిన్నపోటీలు నిర్వహించనున్నామన్నారు. వివేకానందుని బోధనలు నేటి యువతకు చేర్చేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసామన్నారు. జిల్లా స్దాయి పోటీలలో ప్రధమ స్ధానం పొందిన వారిని రాష్ట్ర స్దాయి సమావేశానికి ఆహ్వానించి బహుమతులు అందచేస్తామని చదలవాడ వివరించారు. సమావేశంలో యువజన సేవల శాఖ సంయిక్త సంచాలకులు రామకృష్ణ, చేనేత, జౌళి శాఖ సంయిక్త సంచాలకులు నాగేశ్వరరావు, లేపాక్షి ప్రత్యేక అధికారి లక్ష్మినాధ్ తదితరులు పాల్గొన్నారు.