గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2024 (12:50 IST)

తలవంచుకుని నడిచివెళ్తున్నా దాడి చేసే వ్యక్తులు, నేనో మధ్యతరగతి మనిషిని: పవన్ కల్యాణ్

pawan kalyan
మధ్యతరగతి ప్రజల బ్రతుకులు గురించి జనసేనాని పవన్ కల్యాణ్ ఆనాడు బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రిలోని ఓ కవితను చదివి వినిపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అందులో.. 
‘‘చిన్నమ్మా! వీళ్ల మీద కోపగించకు,
వీళ్లనసహ్యించుకోకు,
నిన్నెన్నెన్నో అన్నారు అవమాన పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
వీళ్లందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం, సంఘ భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు
చిన్నమ్మా
వీళ్లందరూ తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌఢ్యం వల్ల బలాఢ్యులు
అవివేకంవల్ల అవినాశులు
వీళ్లందరూ మధ్యతరగతి మనుష్యులు
సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు
శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు
 
చిన్నమ్మా
వీళ్లను విడిచి వెళ్లిపోకు
వీళ్లందరు నీ బిడ్డలు..’’
ఈ కవితకి తోడుగా తను గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర చదివానని పవన్ చెప్పారు. కాలేజీ రోజుల్లో మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత తనను వేధించేదని, దాన్నుంచి ఎలా బైటపడాలా అని ఆలోచన చేసేవాడినని తెలిపారు. తను సూపర్ స్టార్ తమ్ముడిగా కాకుండా ఓ సగటు ఉద్యోగి కొడుకుగానే ఎక్కువగా జీవించానని తెలిపారు. తప్పించుకోవడానికి తిరుపతిలోని యోగ మార్గానికి వెళ్లానని చెప్పుకొచ్చారు.

అక్కడికి మా అన్నయ్య చిరంజీవిగారు వచ్చి... నువ్వు నిజంగానే యోగమార్గంలోకి వెళ్తున్నావా లేదంటే బాద్యతల నుంచి తప్పించుకుంటున్నావా అని ప్రశ్నించారనీ, అందుకే తను వెళ్తున్నది తప్పు కాదని నిరూపించేందుకు నటనా వృత్తిలోకి వచ్చాననీ, కష్టపడి మీ ముందు నిల్చున్నానని చెప్పారు. కనుక ప్రతి మనిషి సాధించే తత్వంతో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.