ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 6 అక్టోబరు 2021 (16:12 IST)

అక్టోబ‌రు 15 వరకు ఇంద్రకీలాద్రిపై నవరాత్రి మహోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల్లో కనకదుర్గ అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు 10 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టైం స్లాట్‌ ప్రకారం దర్శనం టిక్కెట్లు ఇస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, తరువాత అన్ని రోజులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనం లభించనుంది. మూలానక్షత్రం రోజు 12వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. 15వ తేదీ విజయదశమి పర్వదినాన సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంపై దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జలవిహారం చేస్తారు. ఊరేగింపులను ఆలయ ప్రాంగణం, పరిసరాలకే పరిమితం చేస్తున్నారు.   
 
ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మొత్తం ఐదు క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. వినాయకగుడి నుంచి టోల్‌గేటు ద్వారా కొండపైన ఓం టర్నింగ్‌ వరకు మూడు క్యూలైన్‌లు, అక్కడి నుంచి అదనంగా ఉచిత దర్శనం లైను ఒకటి, వీఐపీ లైను ఒకటి సిద్ధం చేశారు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దర్శనానంతరం కొండ దిగువన మహామండపం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారు. 13 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి, 10 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. కొండపైన, దిగువన సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. పున్నమి, భవాని ఘాట్‌లలో భక్తులు నదిలో స్నానం చేసే అవకాశం ఉన్నందున ఆ మార్గాలను మూసివేశారు. ఉత్సవాలకు 3 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.  
 
ఉత్సవాల్లో అమ్మవారు గురువారం బాలత్రిపుర సుందరిదేవిగా, శుక్రవారం మహేశ్వరిగా, శనివారం వైష్ణవిదేవిగా, ఆదివారం అన్నపూర్ణ దేవిగా, సోమవారం లలితా త్రిపురసుందరిదేవిగా, మంగళవారం మహాసరస్వతిదేవిగా, బుధవారం మహాలక్ష్మిగా, గురువారం మహిషాసుర మర్ధినిగా, శుక్రవారం విజయదుర్గగా దర్శనమిస్తారు.