శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు జైలుశిక్ష!!
వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్టణంలోని ఎస్సీఎస్టీ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో పాటు రూ.2.50 లక్షల అపరాధం కూడా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో త్రిమూర్తులతో పాటు ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది.
గత 28 యేళ్ళ క్రితం జరిగిన కేసులో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించడం గమనార్హం. 1996 డిసెంబరు 29వ తేదీన దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాళెంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు.