అభిమాని అత్యుత్సాహం.. పవన్ కళ్యాణ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. మత్స్యుకారుల అభ్యున్నతి సభలో ప్రసంగించేందుకు వెళ్లగా, ఓ అభిమాని అత్యుత్సావం వల్ల పవన్ కళ్యాణ్ చిన్నపాటి ప్రమాదంలో చిక్కుకున్నారు.
రాష్ట్రంలోని మత్స్యుకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహానికి పవన్ కిందపడిపోయారు. దీంతో రోడ్‌షోలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ అభిమాని చేసిన పనికి పవన్ కళ్యాణ్ కిందపడిపోయినప్పటికీ.. ఆ తర్వాత నవ్వుతూ పైకి లేచి, ప్రజలకు అభివాదం చేశారు.
నిజానికి నరసాపురం పట్టణం చేరుకున్న తర్వాత ఆయన అందరికీ కనిపించాలన్న ఉద్దేశ్యంతో కారు పైకి ఎక్కారు. అయితే, వెనుక నుంచి ఓ అభిమాని దూసుకొచ్చి కారుపైకి ఎక్కి పవన్‌ను కోగిలించుకోబోయాడు. అంతలోనే ఓ బాడీగార్డ్ గమనించి అభిమానిని పట్టుకుని కిందకులాగాడు.
దీంతో సపోర్టు కోసం ఆ అభిమాని పట్టుకోసం పవన్‌ను పట్టుకున్నాడు. కానీ, బాడీగార్డ్ మరింత బలంగా లాగడంతో పవన్‌ను తోసేసి కిందకు లాగేశాడు. ఈ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ కూడా పట్టుకోల్పోయి కాలు జారి కారు టాప్‌పై పడిపోయాడు.
ఆ తర్వాత ఆయన కారుపైనే కొద్దిసేపు కూర్చొండిపోయారు. ఆ తర్వాత చిరునవ్వుతూ లేచి నిలబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.