ఇనుప చువ్వలపై పడిన కార్మికుడు.. గొంతులో దిగి.. కుడికన్ను దిగువ నుంచి..?
బిల్డింగ్‌పై జరుగుతున్న ఎలక్ట్రిక్ పనులు ఓ కార్మికుడి ప్రాణాల మీదకు తెచ్చింది. బిల్డింగ్‌పై ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నాయి. కింద పదునైన ఇనుప చువ్వలు ఉన్నాయి. ఐతే దురదృష్టవశాత్తు ఓ కార్మికుడు కింద ఉన్న ఇనుప చువ్వలపై పడిపోయాడు. ఇనుప చువ్వ అతడి గొంతులో దిగి ముఖం నుంచి బయటకు వచ్చింది. విశాఖపట్టణంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని అగనంపూడి హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రిలో ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నాయి. మొదటి అంతస్తులో ప్రైవేటు బిల్డింగ్ సర్వీసెస్ కంపెనీకి చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఐతే ఉత్తరప్రదేశ్ వాసి రాహుల్ సివాక్(22) ఆసుపత్రి మొదటి అంతస్తులో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ, జారిపడ్డాడు. అమాంతం కింద ఉన్న ఇనుప చువ్వలపై పడిపోయాడు. ఓ ఇనుప చువ్వ రాహుల్ గొంతులోకి దిగింది. కుడి కన్ను దిగువ నుంచి బయటికి చొచ్చుకొచ్చింది. వెంటనే సహచర కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది రాడ్డును కోసేశారు. రాహుల్ సివాక్‌ను హుటాహుటిన గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు తీవ్రంగా శ్రమించి ఇనుప రాడ్డును బయటకు తీశారు. దంత వైద్యుడు టి.సునీల్, ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ జి.రాకేశ్, డాక్టర్ కృష్ణమూర్తితో కూడిన బృందం రెండున్నర గంటల పాటు సర్జరీ చేశారు. మరో వారం రోజుల్లో బాధితుడు కోలుకుంటాడని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఇనుప చువ్వ గొంతులో దిగి ముఖంపై నుంచి రావడంతో... మొదట అందరూ భయడిపోయారు. కానీ డాక్టర్ల కృషితో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.