సీఎం జగన్ ఫ్యామిలీతో క్లోజ్.. మంచు విష్ణు మీరైనా చెప్పొచ్చు కదా..!?
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉద్యమానికి సినీరంగానికి చెందిన పలువురు కళాకారులు సైతం బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఆర్పీ పట్నాయక్ తదితరులు సోషల్ మీడియా ద్వారా స్పందించారని, మిగిలినవారు కూడా సహకరించాలని నిర్వాసితులు కోరుతున్నారు.
అయితే ఉక్కు ఉద్యమంపై టాలీవుడ్ పెద్దలెవరూ ఇంతవరకూ బహిరంగంగా స్పందించలేదు. ఇదే సమయంలో 'మోసగాళ్ళు' సినిమా ప్రమోషన్ కోసం మంచు విష్ణు బృందం విశాఖ వెళ్ళింది. అయితే అక్కడ విష్ణుకు చేదు అనుభవం ఎదురైంది. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతున్న నిరసన కారులు మంచు విష్ణును అడ్డుకున్నారు. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. అనూహ్యంగా ఎదురైన ఈ చేదు అనుభవంతో విష్ణు ఆ తర్వాత మీడియాతో వివరణ ఇచ్చారు. ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
'మోసగాళ్లు' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విశాఖకు వచ్చిన మంచు విష్ణు మెలోడీ థియేటర్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలుగువారంతా ఒక్కటి కావాలన్నారు. కార్మికుల పోరాటానికి పార్టీలకతీతంగా అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ కూడా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్నారు.
వైఎస్ కుటుంబంతో మోహన్‌బాబు కుటుంబానికి ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయి. ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. మంచు విష్ణు భార్య వెరోనికా వైఎస్ కుటుంబంలోని సభ్యురాలే. కొంతకాలంగా వైఎస్ కుటుంబంతో మంచు కుటుంబం మరింత సన్నిహితంగా మెలుగుతోంది.. ఎన్నికల సమయంలో వైసీపీకి మోహన్‌బాబు బహిరంగంగానే మద్దతు పలికారు.
అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ ఇంటికి విష్ణు వెళ్ళొస్తుంటారు. అంతేకాదు జగన్ దంపతులతో విష్ణు దంపతులు కలిసి భోజనం కూడా చేసేంత చనువు ఉంది. జనవరి 29న సీఎం జగన్ ఇంటికి వెళ్లి భోజనం చేశామని మంచు విష్ణు భార్య సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల దు:ఖాన్ని సీఎం జగన్‌కు మంచు విష్ణు వివరించవచ్చు కదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.