డీఎంకే రూ.1000 ఇస్తే.. అన్నాడీఎంకే రూ.1500 ఇస్తుంది.. ఫ్రీ గ్యాస్ కూడా...
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే... ఇటీవల తిరుచ్చి వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో పదేళ్ళ అభివృద్ధి ప్రణాళికను ఆ పార్టీ అధినేత ఎంకేస్టాలిన్ ప్రకటించారు. పనిలోపనిగా కుటుంబ మహిళకు నెలకు రూ.1000 నగదు ఇస్తామని వెల్లడించారు.
దీంతో అప్రమత్తమైన అన్నాడీఎంకే నేతలు కూడా హామీల వర్షం కురిపిస్తున్నారు. డీఎంకే వెయ్యి ఇస్తే తాము నెలకు 1500 రూపాయలిస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వెల్లడించారు. ఇది తాము ఆ పార్టీ నుంచి కాపీ కొట్టింది కాదని, తమ మేనిఫెస్టోలో పెట్టదలచుకున్న అంశం లీక్ కావడంతో స్టాలిన్ ముందుగానే ఆ విషయాన్ని ప్రకటించారని తెలిపారు.
అలాగే, ఒక ఏడాదికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లను కూడా అందజేస్తామని సీఎం ఎడప్పాడి ప్రకటించారు.అయితే ఈ సిలిండర్ల పంపిణీకి ఎవరిని ప్రాతిపదికగా తీసుకున్నారన్నది ఆయన స్పష్టం చేయలేదు. మహిళా దినోత్సవం సందర్భంగా పళనిస్వామి ఈ ప్రకటన చేస్తూ.. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నామన్నారు. డీఎంకే విజన్ డాక్యుమెంట్ నుంచి ఈ హామీలను తాము కాపీ కొట్టామన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నిజానికి మా ప్రతిపాదనలు లీక్ అయ్యాయని, వాటినే డీఎంకే కాపీ కొట్టిందని ఎదురుదాడి చేశారు.
డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు తనకు మధ్య విభేదాలున్నాయని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అన్నాడీఎంకేలో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మునేట్ర కళగం విలీనమనవుతుందా? అన్న ప్రశ్నకు ఆయన ఆ ప్రతిపాదన ఏదీ లేదని, ఈ విషయాన్నీ ఇదివరకే స్పష్టం చేశామన్నారు.
కాగా అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం, దినకరన్ నేతృత్వంలోని ఈ పార్టీ మధ్య కుదిరిన పొత్తుపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. అది వారి ఆంతరంగిక వ్యవహారమన్నారు. మరి కొన్ని రోజుల్లోనే తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని పళనిస్వామి వెల్లడించారు. బీజేపీకి 20 సీట్లు ఇచ్చేందుకు తాము అంగీకరించామని, త్వరలో ఆ పార్టీ నేతలు తమిళనాడులో ప్రచారానికి రానున్నారని చెప్పారు.