మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (10:04 IST)

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిదే విజయమంటున్న ఖుష్బూ!

తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార, విపక్ష పార్టీల నేతలు ముమ్మరంగా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా, అధికార అన్నాడీఎంకే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి ఏర్పాటైంది. ఈ కూటమిలో అన్నాడీఎంకేతో పాటు... బీజేపీ, ఎండీఎంకే, పీఎంకేలు ఉన్నాయి. 
 
ట్రిప్లికేన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ కోఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి నిన్న ఆమె ప్రారంభించారు. తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
 
ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ బరిలోకి దిగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఇరు పార్టీల మధ్య ఇటీవల విభేదాలు పొడసూపగా, ప్రస్తుతం సద్దుమణిగాయి. 
 
ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుందని బీజేపీ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, ఆ తర్వాత పళనిస్వామే తమ కూటమి సీఎం అభ్యర్థి అని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.
 
కాగా, ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఖుష్బూ.. బీజేపీ రాష్ట్ర మత్స్యశాఖ అధ్యక్షుడు సతీశ్‌కుమార్, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి ట్రిప్లికేన్‌లోని ప్రసిద్ధ  తిరువట్టీశ్వరన్‌ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.