శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:27 IST)

ఇదేనా మీరు చెప్పిన రైతు రాజ్యం?: జగన్ పై లోకేశ్ ఫైర్

సీఎం నుంచి మంత్రుల‌వ‌ర‌కూ రైతుల్ని అవ‌మానిస్తున్నార‌ని, ఇదేనా జ‌గ‌న్‌రెడ్డి తీసుకొస్తామ‌న్నా రైతురాజ్య‌మ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌శ్నించారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో పంట న‌ష్ట‌పోయిన రైతులు, గ్రామ‌స్తుల‌ను ప‌రామ‌ర్శించారు.

వ‌ర‌ద‌ల‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రైతుల్ని పరామర్శించి వారికి న్యాయం చెయ్యాలని పోరాటం చేస్తున్నందుకు జగన్ రెడ్డి త‌న‌ మంత్రులతో తిట్టిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక మంత్రి నన్ను ఎద్దు అని ఆడిపోసుకున్నార‌ని, రైతుకి వ్య‌వ‌సాయంలో అండ‌గా వుండేవి ఎద్దులేన‌ని, పంట‌లు కోల్పోయిన రైతుల‌కు అండ‌గా వున్న నేను ఎద్దునైతే, రైతుల్ని హింసిస్తున్న జగన్ రెడ్డి తన్నే దున్నపోతా? అని ప్ర‌శ్నించారు.

ప‌ద‌వులు, అధికారం లేని లోకేష్ ప‌రామ‌ర్శించ‌డానికి అర్హుడు కాద‌ని మంత్రులు నిల‌దీస్తున్నార‌ని, అధికారం ఉన్న మీరు ఆప‌ద‌లో వున్న‌వారిని ప‌ట్టించుకుంటే తాను ఈ ప‌ర్య‌ట‌న‌లు చేయాల్సిన అవ‌స‌రమే వ‌చ్చేది కాద‌న్నారు. 40 ఏళ్ల‌లో క‌నివినీ ఎరుగ‌ని వ‌ర‌ద‌ల‌కు కృష్ణా జిల్లాలో వరి,పత్తి,మొక్కజొన్న,మినుము, ఉద్యాన వన పంటలు, ఆక్వారంగం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌న్నారు.

ఎకరానికి 5 లక్షలు పెట్టుబడి పెట్టిన రొయ్యలు,చేపల చెరువులు పెంప‌కం చేప‌ట్టిన ఆక్వారైతులు ముంపుతో తీవ్రంగా నష్టపోయార‌ని, వీరిని ఆదుకోవ‌డం మ‌రిచిపోయిన స‌ర్కారు క‌నీసం ప‌రామ‌ర్శించేందుకు రాక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. వారం రోజుల‌పాటు నీటి ముంపులోనే ఉంటే.. నిత్యావ‌స‌రాలు ఇస్తామంటూ జీవో ఇచ్చిన స‌ర్కారు రెండు వారాలుగా నీట్లోనే గ్రామ‌స్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నా ఒక్క స‌రుకు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం ప్ర‌జ‌లంటే ప్ర‌భుత్వానికి ఎంత నిర్ల‌క్ష్య‌మో అర్థం అవుతోంద‌న్నారు.

కృష్ణా జిల్లాలో 1,08,680 ఎకరాల్లో పత్తి పంటను రైతులు కోల్పోయారు.చెరుకు,బొప్పాయి,అరటి పంటలు పూర్తిగా నీటిలో మునిగి కుళ్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయిన క‌నీసం ప‌ట్టించుకునే నాథుడే లేడ‌న్నారు. కనీసం రైతులకు విత్తనాలు,ఎరువులు ఇవ్వలేని జ‌గ‌న్‌రెడ్డి చేత‌కాని స‌ర్కారుని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించాల‌న్నారు. 17 నెలల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో రాష్ట్రంలో 750 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే అన్న‌దాత‌కి ఎంత అన్యాయం చేస్తున్నారో అర్థం అవుతోంద‌న్నారు.

వ్య‌వ‌సాయానికి ఊత‌మిచ్చేలా అన్న‌దాత‌ని ఆదుకునే అనేక సంక్షేమ కార్యక్రమాలు టిడిపి హ‌యంలో చేప‌ట్టి వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధి సాధించి దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అగ్ర‌స్థానానికి చేర్చితే, జ‌గ‌న్‌రెడ్డి హ‌యాంలో ఏపీ వ్య‌వ‌సాయ‌రంగం అథఃపాతాళంలోకి దిగ‌జారిపోయింద‌న్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే, రైతుభరోసా 57 వేల మందికి ఇవ్వ‌డ‌మేనా జ‌గ‌న్‌రెడ్డి రైతు సంక్షేమం అని ప్ర‌శ్నించారు. 

సున్నా వడ్డీకే రుణాలు అంటూ రైతుల నోట్లో సున్నం కొట్టారు జగన్ రెడ్డి. టిడిపి రూ.3,500కోట్లు ఇస్తే, ఎన్నిక‌ల‌కు ముందు 4 వేల కోట్లిస్తామ‌ని హామీ ఇచ్చి కేవలం 100 కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో టిడిపి హ‌యాంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల‌న్నీ ఆగిపోయాయ‌ని, టిడిపి క‌ట్టిన‌ పట్టిసీమని వ‌ట్టిసీమంటూ ఎద్దేవ చేశార‌ని, అదే ప‌ట్టిసీమ మోటార్లు ఆన్‌చేయ‌క‌పోతే చాలా ప్రాంతాల్లో పంట‌లు ఎండిపోయేవ‌న్నారు.

టిడిపి పోలవరం పనులు 70 శాతం పూర్తి చేస్తే 17 నెలల్లో కనీసం 2శాతం కూడా చేయ‌లేని చేత‌కాని జ‌గ‌న్‌రెడ్డి.. త‌న కేసులు మాఫీ కోసం ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వ‌రం తాక‌ట్టు పెట్టార‌ని ఆరోపించారు. జ‌గ‌న్‌రెడ్డి హ‌యాంలో  ఆక్వా, హార్టిక‌ల్చ‌ర్‌, సెరికల్చర్, పౌల్ట్రీ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయినా, వారిని ఆదుకునే నాథుడే లేడ‌న్నారు. రైతులకి రూపాయి కూడా సాయం ఇవ్వ‌ని జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు కాంట్రాక్టర్లకు రూ. 6,400 కోట్లు ఎలా దోచిపెట్టింద‌ని నిల‌దీశారు. ‌

గత ఏడాది వ‌ర‌ద‌ల‌కు పోయిన పంట‌ల‌కు నష్టపరిహారం ఇప్పటి వరకూ రైతుల‌కు అంద‌లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌ద‌ల న‌ష్టమే ఇంకా లెక్కించ‌లేద‌ని, ఇంకెప్పుడు రైతుల్ని ఆదుకుంటార‌ని జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌శ్నించారు. త‌న గొప్ప‌ల కోసం అప్పులు చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన కేంద్ర నిబంధ‌న‌లకు త‌లొగ్గి ఉచిత విద్యుత్ ప‌థ‌కం ఎత్తేస్తున్నార‌ని ఆరోపించారు. వ్య‌వసాయ విద్యుత్ మోటార్ల‌కు మీట‌ర్లు బిగిస్తే అదే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి ఉరితాళ్లుగా మార‌తాయ‌ని హెచ్చ‌రించారు.