జగన్ పై క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి: అశ్విని ఉపాధ్యాయ
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించేందుకు అనుమతి కావాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా కె కె వేణుగోపాల్ ను కోరారు.
న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ బిజెపి నాయకుడు కావడం గమనార్హం. సుప్రీంకోర్టు సీనియర్ జస్టిస్ ఎన్ వి రమణపై బహిరంగ వేదికలపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాంలపై కోర్టు ధిక్కరణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.
ఈ మేరకు ఆయన అటార్నీ జనరల్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ వేదికలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేసి రెండు వారాలు గడిచిందని, ఇప్పటికే సుమోటోగా తీసుకోవాల్సిన కేసును సుప్రీంకోర్టు ఇప్పటి వరకూ తీసుకోలేదని అందువల్ల బాధ్యతగల సుప్రీంకోర్టు న్యాయవాదిగా తాను ఈ అభ్యర్ధన పంపుతున్నారనని ఆయన పేర్కొన్నారు.
అశ్విని ఉపాధ్యాయ గతంలో ఎమ్మెల్యేలు ఎంపిలపై ఉన్న కేసులు సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఆయన వేసిన పిల్ ఆధారంగానే జస్టిస్ ఎన్ వి రమణ సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేస్తూ ఎంపిలు ఎంఎల్ఏలపై ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. న్యాయమూర్తి ఎన్ వి రమణ ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం వల్లే జగన్ మోహన్ రెడ్డి ఆయనపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసి బహిరంగ పరిచారని అశ్విని ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు.