ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (20:27 IST)

21న దుర్గ‌మ్మ‌కు పట్టువస్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నజ‌గ‌న్

శరన్నవరాత్రుల్లో భాగంగా క‌న‌క‌దుర్గ‌మ్మ జ‌న్మ న‌క్ష‌త్ర‌మైన మూల‌ నక్షత్రాన్ని పురస్కరించుకుని  ఈ నెల 21న కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్, నగర పోలీసు కమీషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

సోమవారం వారిరువురుతో పాటు ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు, ఉత్సవాల ప్రత్యేక అధికారి చంద్రశేఖర్‌ అజాద్ వివిధ శాఖల అధికారులతో ఇంద్రకీలాద్రిపై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల గురించి చర్చించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజున సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే దుర్గ‌మ్మ‌కు 21వ తేది మధ్యాహ్నం ముఖ్యమంత్రి కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తార‌ని తెలిపారు.

ముఖ్యమంత్రి పర్యటన, దర్శన ఏర్పాట్ల కార్యక్రమంపై ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. 

నగర పోలీస్ కమీషనర్ బ‌త్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో కోవిడ్-19 నిబంధనలను అధి కారులు పాటించేలా చూడాలన్నారు.

సీఎం పర్యటన సమయంలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 నిబంధనల మేరకు ముఖ్యమంత్రి వెంట పరిమిత సంఖ్యలో అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నామని కమీషనర్ అన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో అడిషినల్ సీపీ లక్ష్మిపతి, డీసీపీలు విక్రాంత్ పాటిల్, ముఖ్యమంత్రి ప్రత్యేక భద్రతాధికారులు వెంకటప్పయ్య, వెంకటరమణ, ఏసీపీ సుధాకర్, వ‌న్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గీతాబాయి, ఆలయ, ప్రోటోకాల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.