జనసేనానికి షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు కార్యకర్తలకు ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మరోమారు తేరుకోలేని షాకిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రశంసల వర్షం కురిపించారు.
సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే రాపాక సొంత నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశాయి. ఇందులో జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పాలనను మెచ్చుకున్నారు. దీంతో ఆయన మరోమారు వార్తల్లో నిలిచారు.
వైకాపా కార్యకర్తలు నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం విజయవంతమయ్యేందుకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అనుచరులు కూడా సహకరించారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ, సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు.