మల్లాది విష్ణుకు టిటిడిలో పదవి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
శ్రీవారి ఆలయంలోని జయవిజయుల వద్ద అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఉదయం 7 గంటలకు శ్రీ మల్లాది విష్ణుతో ప్రమాణం చేయించారు. అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. శ్రీ ధర్మారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందించారు.
టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తనను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మల్లాది విష్ణు. ఆలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.