అధికారంలో ఉన్ననాళ్ళు మత్స్యకారులను కనీసం మనుషులుగా కూడా గుర్తించని చంద్రబాబు నాయుడు.. ఆయనకు వత్తాసు పలుకుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మత్స్యకారులపై లేని ప్రేమను లేఖల రూపంలో చూపిస్తే.. నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.
శ్రీకాకుళంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అప్పలరాజు మాట్లాడుతూ.. మత్స్యకారులకు చంద్రబాబు చేసిన మోసాన్ని, ఆయన హేళనగా మాట్లాడిన మాటలు ఎప్పుడు గుర్తుకు వచ్చినా మత్స్యకారుల రక్తం మరిగిపోతుందని అన్నారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 217 తెస్తే.. దానిని ఎందుకు తప్పు పడుతున్నారో, దానివల్ల మత్స్యకారులకు జరిగే నష్టం ఏమిటో చెప్పాలని చంద్రబాబు, సోము వీర్రాజులను మంత్రి అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు.
ప్రస్తుత విధానం వల్ల మత్స్యకారుల నోటికాడ తిండిని దళారులు, పెట్టుబడిదారులు కొట్టేస్తున్నారని, దాంతో మత్స్యకారులకు ఏడాదికి రూ. 300 నుంచి 1000 మాత్రమే వస్తుందన్నారు. బహిరంగ వేలం ద్వారా మత్స్యకార సొసైటీలోని ప్రతి సభ్యుడికి రూ. 15 వేలు ఆదాయం వరకు వచ్చేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఇందులో తప్పేంటో లేఖలు రాసిన చంద్రబాబు, సోము వీర్రాజులు చెప్పాలన్నారు.
చంద్రబాబు నాయుడుని, ఆయన రాస్తున్న లేఖలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బాబును అనుసరిస్తూ, టీడీపీ ఆఫీసులో తయారైన లేఖపై సంతకం చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి గారికి లేఖ రాయటం అంటే ఇది పూర్తిగా రాజకీయ కుట్రేగానీ, మత్స్యకారుల మీద ప్రేమ కాదన్నారు. బీజేపీ- టీడీపీలు ఇంకెంతకాలం తెరచాటు బంధాన్ని కొనసాగిస్తారని అప్పలరాజు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 27,363 చెరువుల్లో 100 హెక్టార్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 582 చెరువులు మాత్రమే నిజానికి ప్రభుత్వ ఉత్తర్వుల పరిధిలోకి వస్తాయని, మిగిలిన 26, 781 నీటి వనరులకు ఉత్తర్వులు వర్తించవని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో కూడా జీవో నంబరు 217 ప్రకారం.. పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాను తీసుకుని, జిల్లాలో కేవలం 27 చెరువులకు మాత్రమే అమలు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.
మత్స్యకారులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ జీవో వల్ల మత్స్యకారులకు మంచే జరుగుతుందన్న విషయాన్ని మత్స్యకారులంతా అర్థం చేసుకుంటున్నారని, రాజకీయ స్వార్థం కోసం టీడీపీ, బీజేపీ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- మత్స్యకారుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుగారు, చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రిగారికి లేఖలు రాయడం జరిగింది. ప్రజల్లో ఉన్నటువంటి సున్నితమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్ష పార్టీలు కుట్రతో పని చేస్తున్నాయి.
ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏంటంటే... ఆ లేఖను చూస్తుంటే సోము వీర్రాజు గారు రాసిన లేఖలా లేదు. ఆయన తన జీవితంలో మత్స్యకారుడు అనే పదాన్ని కూడా ఉచ్ఛరించలేదు. అది పూర్తిగా చంద్రబాబు గారి ఆఫీస్‌లో తయారైన లేఖ. సోము వీర్రాజు తన లెటర్ హెడ్ ఇచ్చి సంతకం పెట్టి ప్రెస్ రిలీజ్ చేసి ఉంటారు.
- వీర్రాజుగారు మీ తెరచాటు బంధాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు. టీడీపీ-బీజేపీ అనుబంధం ఎంతకాలం ఉంటుంది. మీరు ఇంకా చంద్రబాబు ఆజ్ఞలు, కనుసన్నలతోనే పనిచేస్తారా? టీడీపీ-బీజేపీ మధ్య తెరచాటు బంధం లేదని బహిరంగంగా చెప్పే ధైర్యం మీకు ఉందా..? మీ డ్రామాలు ఇక ముగిస్తే చాలా మంచిది.
2- చంద్రబాబు మత్స్యకారులకు చేసిన అన్యాయానికి, మోసానికి, హేళనగా మాట్లాడిన ఆయన మాటలు గుర్తు వచ్చినప్పుడల్లా.. మా మత్స్యకారుల రక్తం ఇప్పటికీ రగిలిపోతుంది. చంద్రబాబు లేఖలు రాసినంత మాత్రాన ఆయన్ను, ఆయన పార్టీనీ ఎవరూ నమ్మరు. బీజేపీ కూడా చంద్రబాబు తాబేదారులా ఉంటామంటే ఊరుకోరు. మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నామని, వారి పొట్ట కొట్టేస్తున్నామని, వారి నోటి దగ్గర కూడు లాగేస్తున్నామని సోము వీర్రాజుగారు లేఖ రాయడం ప్రపంచంలోనే ఎనిమిదో వింత. కేంద్రం, బీజేపీ విధానాలు అందరికీ తెలుసు. ఏపీకి ఎలా అన్యాయం చేశారో తెలుసు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని వీర్రాజుగారు బీజేపీ అధిష్టానానికి లేఖ రాసి, ఒక్కసారి అయినా ప్రశ్నించగలిగారా? విభజన హామీలు ఇచ్చి మోసం చేశారు. దానిపై ఎందుకు మీ అధిష్టానాన్ని అడగడంలేదు? మీకు భయమా? సిగ్గుగా అనిపించడంలేదా? లేక చంద్రబాబు చెప్పలేదని మీ అధినాయకత్వాన్ని ప్రశ్నించడంలేదా?
- స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో పాటు.. జాతీయ మానిటైజేషన్ అని అర్థం కాని పేర్లు పెట్టడం, ప్రభుత్వ సంస్థలను అమ్మివేయడం... వీటన్నింటిపై మీరు ఎందుకు అడగటం లేదు. ఈ అంశాల్లో చంద్రబాబు కూడా మాట్లాడటం లేదంటే.. డ్రామా కాక మరేమిటి..?
- చంద్రబాబు కనుసన్నల్లో తయారైన సోము వీర్రాజు లేఖలో... రాష్ట్రంలోని అన్ని చెరువులు, ట్యాంకులు, రిజర్వాయర్లు ఆక‌్షన్ వేసేస్తున్నట్లు మత్స్యకారులను రెచ్చగొడుతున్నారు. మత్స్యకారులు అంత అమాయకులేమీ కాదు, వాస్తవాలను తెలుసుకోలేకపోవడానికి. ప్రతిదాన్ని నిశితంగా పరిశీలించి జీవోను అర్థం చేసుకునే పరిస్థితిలో మత్స్యకారులు ఉన్నారు. వారికి కూడా వాస్తవాలు తెలుసు.
3- చంద్రబాబు చెబితే మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్ గారికి లేదు. పాదయాత్ర సమయంలో నెల్లూరులోని మత్స్యకారులు వైఎస్ జగన్‌గారిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న విషయం తెలిసిందే. మధ్యవర్తులు, దళారులు, పెట్టుబడిదారులు రిజర్వాయర్లును తమ కనుసన్నల్లో ఉంచుకుని తమను బతకనివ్వడం లేదని ఆరోజు జగన్ గారికి మొర పెట్టుకున్నారు.
దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు.. మత్స్యకారుడికి నిర్ణీత ఆదాయం రావాలని 217 జీవోను అనుసరించి, నెల్లూరు జిల్లాలో 27 ట్యాంక్‌లను పబ్లిక్ ఆక‌్షన్‌కు తీసుకురావడం జరిగింది. ఆక‌్షన్ ద్వారా వచ్చిన సొమ్ములో 30 శాతం సొసైటీలకు, తద్వారా ప్రతి మత్స్యకారుడికి కనీసం రూ.15వేలు వరకు ఆదాయం రావాలని ఈ విధానం తేవడం జరిగింది.
4- రాష్ట్రంలో 27,363 చెరువులు, ట్యాంకులు ఉన్నాయి. ఇందులో వంద హెక్టార్లు, ఆపైబడినవి 582 చెరువులు ఉంటే.. వాటిలో 337 ట్యాంకులను 253 ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీలకి లీజు ఇవ్వడం జరిగింది. మిగతావి 23, 920 చెరువులు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అంటే, 26,781 ట్యాంకులు ఈ జీవో పరిధిలోకి రావడం లేదు. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద కేవలం 27 రిజర్వాయర్లకు పబ్లిక్ ఆక‌్షన్ కు వెళ్ళి, 217 జీవో అమలు చేయడం జరుగుతుంది.
వేలం ద్వారా వచ్చే మొత్తంలో ఆ మత్స్యకార సొసైటీకి 30శాతం, ప్రతి సంఘం సభ్యుడికి రూ. 15వేలు వరకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో మత్స్యకారులకు జరుగుతున్న నష్టమేంటో చంద్రబాబు, సోము వీర్రాజులు చెప్పాలి. ఇన్నివేల చెరువులు ఈ జీవో పరిధిలోకి రానప్పుడు ఏరకంగా మత్స్యకారులను రెచ్చగొడతారు. వారిలో ఏరకంగా అభద్రతభావం కలిగిస్తున్నారు..? పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించేందుకు మత్స్యకారులు కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ జీవోను మత్స్యకార పెద్దలకు తెలియచేయడంతో ... వారు దాన్ని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించారు.
మత్స్యకారులకు బాబు చేసిందేమిటి..?
5- అసలు చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు ఏం చేశారో చెప్పాలి? మత్స్యకారుల భరోసా ఏటా రూ. 10 వేలు చొప్పున మత్స్యకార భరోసా మేము ఇస్తున్నాం. అది మీకు 40 ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీలో సాధ్యపడిందా? లక్షా 19వేల మందికి పైగా మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఇస్తున్నాం. అదే టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అయినా సాయం చేయగలిగారా?
డీజిల్‌పై సబ్సిడీ అన్నారు, ఏ ఒక్కరికి అయినా ఇవ్వగలిగారా? ఈ ప్రభుత్వం మత్స్యకారుడికి నేరుగా అందేలా రూ.9 లు డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం. గతంలో వేటకు వెళ్ళి మత్స్యకారులు చనిపోతే.. బీమా కూడా చెల్లించలేదు. ఈ ప్రభుత్వం ప్రమాదవశాత్తూ మత్స్యకారుడు చనిపోతే. రూ.10 లక్షల పరిహారం ఇస్తుంది. మీరు ఇవ్వగలిగారా? మీ ప్రభుత్వ ఎందుకు ఇలాంటి ఆలోచన చేయలేకపోయింది చంద్రబాబు గారూ?
మత్స్యకారుల సంక్షేమం కోసం జగన్ చేస్తున్న పనులు చెబితే.. ఒక గ్రంథమే అవుతుంది.
6- రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే పనులు ప్రారంభించాం. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు... తీర ప్రాంతంలో ఒక జెట్టీకానీ, ఒక హార్బర్ కానీ నెలకొల్పగలిగారా?
మత్స్యకారుల కష్టాలు తెలుసు కాబట్టే... యువ నాయకుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి ఆలోచనలు చేసి మత్స్యకారులకు అన్నివిధాలా అండగా ఉంటున్నారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితే మీకు ప్రమాదం అని భావించే.. వారి సంక్షేమాన్ని బాబు పట్టించుకోలేదు.
మత్స్యకార మహిళలకు గౌరవం దక్కేలా చేపల అమ్మకానికి మినీ రిటైల్ అవుట్‌లెట్లు
7- అతి త్వరలో ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో చేపలు అమ్మకం జరిగేలా మినీ రిటైల్ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మత్స్యకారుల మహిళలకు గౌరవం వచ్చేలా బ్రహ్మాండమైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించబోతున్నాం. మీరు ఏరోజు అయినా ఇలా ఆలోచించగలిగారా చంద్రబాబూ..? మత్స్యకారులంటే బాబుకు ఎప్పుడూ చులకనే.
8- జగన్ మోహన్ రెడ్డిగారు తెచ్చిన నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఆదుకునేలా చేస్తున్నాం. ప్రతి మత్స్యకారుడు చదువుకునేలా, ప్రతి మత్స్యకారుడికి సొంత ఇల్లు ఉండేలా చేస్తున్నాం. టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకారుడు అయిఉండి కూడా, వారి హయాంలో ఏం చేయలేదని తెలిసి కూడా చంద్రబాబు చెప్పటం వల్ల, తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు.
9- సోము వీర్రాజుగారికి దమ్ము, ధైర్యం, చేవ ఉంటే ప్రత్యేక హోదా గురించి బీజేపీ అధిష్టానాన్ని అడగాలి. హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం నుంచి అత్యధిక వాటా నిధులు తెచ్చుకోగలుగుతున్నారు. మీకు ఆలోచన ఉంటే, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, ప్రత్యేక హోదాను అడగండి. మీకు ధైర్యం లేదు. ఎందుకంటే చంద్రబాబు కూడా ప్రధాని మోదీగారిని హోదా అడగలేదు. సోము వీర్రాజు గారు ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి.
10- మన రాష్ట్రంలో ఉత్పత్తయ్యే చేపలను ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, పోషక విలువలు ఇచ్చే చేపల వినియోగాన్ని రాష్ట్రంలో పెంచాలని మత్స్య శాఖ ఒక నిర్ణయం తీసుకుంది.