పవన్ కల్యాణ్‌కు అన్యాయం జరగట్లేదు.. ఫ్యాన్స్ గుర్తించాలి: రోజా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ ధరల తగ్గింపుపై రచ్చ రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను తొక్కేయడానికే జగన్ ఇదంతా చేస్తున్నారని ప్రచారం జరుగుతుండడం దురదృష్టకరమని తెలిపారు.
నిజానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి జగన్ మేలు చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణలో సినిమా టికెట్ ధర రూ.350 ఉందని, ఏపీలో మాత్రం కేవలం రూ.150 ఉందని చెప్పారు. చాలా మంది సినిమా చూసే అవకాశం ఉంటుందన్నారు.
టికెట్ల ధరలు తగ్గిస్తే పవన్ కల్యాణ్‌ను తొక్కేసినట్లు ఎలా అవుతుందని రోజా ప్రశ్నించారు. సినిమా నష్టపోతే పవన్ కల్యాణ్‌కు వచ్చే నష్టమేమి లేదని, ఎందుకంటే ఆయన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కాదన్నారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా, బాలకృష్ణ అఖండ సినిమాలకు ఎంత టికెట్ ధర ఉందో భీమ్లా నాయక్ సినిమాకు కూడా అంతే రేటు ఉందని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్‌కు అన్యాయం జరగట్లేదని ఆయన అభిమానులు తెలుసుకోవాలని ఆమె చెప్పారు.