సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (08:39 IST)

మంత్రి రోజా అన్నదమ్ముల దౌర్జన్యాలతో విసిగిపోయాం.. ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం... వైకాపా నేతలు

rkroja
నగరి వైకాపా ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజాపై సొంత నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె నగరి అసెంబ్లీ టిక్కెట్ మళ్లీ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, రోజా అన్నదమ్ముల దౌర్జన్యాలు, రౌడీయిజం, అక్రమాలతో విసిగిపోయాం. మేమంతా మంత్రి రోజా దాష్టీకానికి బలైన బాధితులం. అందువల్ల ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదు అంటూ వైకాపా నేతలు ఓ తీర్మానం చేశారు. 
 
తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నగరికి చెందిన అనేక మంది వైకాపా నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. రోజా వద్దు జగన్ ముద్దు అనే ప్లకార్డులను ప్రదర్సించారు. ఇందులో నిండ్ర మండలానికి చెందిన వైకాపా రైతు విభాగం జిల్లా కార్యదర్శి మురళి, కాయం పంచాయతీ మాజీ సర్పంచ్ తులసీరామ్ రెడ్డి, నాయకులు మునీంద్ర, జయచంద్రారెడ్డి, వాసుదేవరెడ్డి, పరందామయ్య యాదవ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. 
 
'మేమంతా నగరి నియోజకవర్గానికి చెందిన రోజా బాధితులం. ఆమె అన్నదమ్ముల అక్రమ సంపాదన, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. గతంలో రోజా గెలుపు కోసం శ్రమించాం. కాయం పంచాయతీలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. ఇటీవల నెట్టేరి గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా స్థానిక ప్రజలు లేకుండా సచివాలయాన్ని రోజా ప్రారంభించారు. ఈసారి ఆమెకు టిక్కెట్ ఇస్తే మేము పని చేయం. అధిష్టానం పునరాలోచన చేయాలి. లేకుంటే నగరి నియోజకవర్గం సీటును వైకాపా వదులుకోవాల్సి వస్తుంది అని' వారు హెచ్చరించారు.