శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (13:08 IST)

కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామన్నాడు.. మంత్రి ధర్మాన

dharmana
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామన్నాడంటూ పేర్కొన్నారు. ఎక్కడి నుంచో వచ్చి అక్కడ అజమాయిషీ చేయాలనుకుంటున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రజాప్రతినిధులు అనేవారు అవినీతికి దూరంగా ఉండాలని ఆయన నీతి వచనాలు పలికారు. శ్రీకాకుళంను తాను చేసినంతగా అభివృద్ధి ఎవరూ చేయలేదని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. 
 
ఆయన సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, దశాబ్దాలుగా తాను ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళంను చూశానని, ఇపుడు శ్రీకాకుళం రౌడీల చేతిలోకి వెళుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామని అన్నాడని, నువ్వు ఎవడివి? శ్రీకాకుళం నీ యబ్బ సొత్తుకాదని, తాను చెప్పానని తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేయాలనుకుంటున్నారని ఇలాంటి వాటిని ఇక్కడ నేతగా తాను అవమానంగా భావిస్తానని చెప్పారు. 
 
సుబ్బారెడ్డికి పైన ఒక లీడర్ ఉంటాడని, ఆ లీడర్‌కు పైన మరొక లీడర్ ఉంటాడని తెలిపాు. ఉత్తరాంధ్రలో ఎన్నో వనరులు ఉన్నాయని, వాటిని కొట్టేసేందుకు రౌడీ మూకలు ఇక్కడకు వస్తున్నాయని ధర్మాన తెలిపారు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా తాను అడ్డుకుంటానని చెప్పారు. ఇలాగే వదిలేస్తే ఈ ప్రాంతమంతా రౌడీలమయం అవుతుందని అన్నారు. ఇతర ప్రాంతాలు కూడా ఇలేగా పాడవుతున్నాయని చెప్పారు. పట్టణాలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. 
 
శ్రీకాకుళంను తాను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదని ధర్మాన చెప్పారు. జిల్లాలో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాననీ, కానీ శ్రీకాకుళంలో మాత్రం తాను తప్ప మెరెవరూ గెలవలేరని అన్నారు. మీ అందరి అభిమానంతోనే ఇంతకాలం గెలిచానని, ఈసారి కూడా విజ్ఞతతో ఆలోచించి, తనను గెలిపించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. ఎన్నికల్లో గెలిస్తే తాను మరింత శక్తిమంతుడిగా ఉంటానని, ఓడిపోతే మీ స్నేహితుడిగా ఉంటానని చెప్పారు.