ఒంగోలు వైకాపా లోక్‍సభ అభ్యర్థిగా మంత్రి ఆర్కే రోజా!!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం అధికార వైకాపా గాలిస్తుంది. ఇందులోభాగంగా, ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సీటు ఇవ్వకూడదని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ స్థానం నుంచి మంత్రి రోజాను బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా నేతలకు పార్టీ నేత విజయసాయి రెడ్డి సమాచారం అందించారట.
ఒంగోలు లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిలబెట్టాలని వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో రోజా పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. తన షరతులకు ఒప్పుకోని ఎంపీ మాగుంటకు మళ్లీ టిక్కెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత మాగుంటకు టిక్కెట్ కోసం మంత్రి బాలినేని కూడా శతవిధాలా ప్రయత్నించారు.
ఈ క్రమంలో పార్టీ అధిష్టానం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ప్రతిపాదించగా జిల్లా నాయకులు వ్యతిరేకించారు. తండ్రీకొడుకులకు టిక్కెట్ ఇచ్చే విధానం పార్టీలో లేదని అన్నారుగా అంటూ బాలినేని.. విజయసాయి, సజ్జలను అడిగినట్టు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం ఒంగోలులో మాగుంటతో మంత్రి బాలినేని, దర్శి ఇంచార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతున్న నాయకులు సీఎంను కలిసి మాగుంటకు టిక్కెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాలన్న యోచన చేసినట్టు తెలుస్తోంది.
అయితే, ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయం దగ్గర మీమాంస తలెత్తినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి శనివారం బాలినేని, మంత్రి సురేశ్‌తో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలతో మాట్లాడి రోజా పేరు ప్రతిపాదించారు. ఒంగోలు ఎంపీ స్థానం అభ్యర్థిగా ఆమెను ఖరారు చేయచ్చని పేర్కొన్నారట. దీనిపై రెండు మూడు రోజుల్లో ప్రకటన విడుదల కానుందని తెలుస్తోంది.