మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (09:30 IST)

వచ్చేవారం నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర

lokesh padayatra
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో యువగళం పాదయాత్రను ఆయన కుమారుడు నారా లోకేష్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యోచిస్తున్నట్లు సమాచారం. 
 
చంద్రబాబు అరెస్ట్ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. అక్కడి నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితిపై లోకేష్ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
 
వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు బాబుపై అవినీతి మరకలు పెట్టలేకపోయారని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు, టీడీపీ నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు కేసుకు సంబంధించి ఢిల్లీలోని లాయర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు లోకేష్ తెలిపారు. కోర్టులో పోరాడుతూనే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. 
 
చంద్రబాబు అరెస్టును, వైసీపీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేతలంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు.