జైలులో చంద్రబాబు - టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంతో ఆ పార్టీ నేతలంతా కలిసి ఒక రాజకీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 14 మంది సభ్యులు ఉంటారు. ఈ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమిస్తూ ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తన ప్రకటనలో తెలిపారు.
ఈ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్, నారా లోకేశ్‌లు ఉన్నారు.