ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:08 IST)

మీసం మెలేసిన బాలకృష్ణ... ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన స్పీకర్

Nandamuri Balakrishna
హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మీసం మెలేశారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. సభలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానానలు స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్లు తిరస్కరించారు. దీంతో టీడీపీ, వైకాపా సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలోవాగ్వాదం జరిగింది. 
 
అసెంబ్లీ ప్రారంభంకాగానే టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, సభను మండలి ఛైర్మన్ వాయిదా వేశారు.
 
 
చంద్రబాబు అరెస్టు అక్రమంటూ టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి, ఆయన మైక్ లాక్కొనే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు స్పీకర్‌పైనే దాడి చేస్తున్నట్టుగా ఉందని మంత్రి ఆరోపించారు. బల్లలు కొట్టాల్సింది ఇక్కడ కాదని న్యాయస్థానాల్లో అని ఎద్దేవా చేశారు.
 
దీంతో అంబటిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అంబటిపై మీసం మెలేయడంతో పాటు... 'దమ్ముంటే రా అంబటీ' అంటూ సవాల్ విసిరారు. దీనిపై అంబటి స్పందిస్తూ... మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోవాలని సెటైర్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో, సభను స్పీకర్ తమ్మినేని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.