బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (15:38 IST)

చట్టబద్ధత లేని షోకాజ్ నోటీసు : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసులో ఎలాంటి చట్టబద్ధత లేదని వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ సభ్యుడు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పైగా, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచానని గుర్తుచేశారు. కానీ, తనకు షోకాజ్ నోటీసు పంపించిన లెటర్‌హెడ్‌లో వైఎస్ఆర్‌సీపీ అని వుందన్నారు. 
 
తాను పోటీ చేసిన గెలుపొందిన పార్టీకి, తనకు ఇచ్చిన లెటర్‌హెడ్‌కు బీఫామ్‌కు తేడాలున్నాయని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసులు ఇచ్చారని, వైఎస్‌ఆర్‌సీపీతో నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాగా, పార్టీ క్రమశిక్షణా చర్యల కింద రఘురామకృష్ణంరాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. 
 
వీటిపై వైకాపా ఎంపీ రాజు బుధవారమే స్పందించారు. షోకాజ్ నోటీసు తనకు అందిందని చెప్పారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఈ నోటీసులు పంపించారని తెలిపారు. అయితే, తాను పార్టీని లేదా పార్టీ అధినేతను మాత్రం పల్లెత్తు మాట అనలేదని గుర్తుచేశారు. 
 
పార్టీకి, పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొన్నారు. 
 
పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడారని, పార్టీ ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యానించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వారంలో రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని... లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని నోటీసులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
 
ఈ నోటీసులపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనకు నోటీసులు అందాయని ఆయన తెలిపారు. తాను ఏనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా చెప్పానని ఆయన అన్నారు. పైగా, తాను చెప్పదలచుకున్న విషయాలు మీడియా ద్వారానే చెప్పినట్టు, ఇక కొత్తగా చెప్పేది ఏమీ లేదన్నారు.