గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:16 IST)

కొత్త వైరస్, పశువులకు కూడా సామాజిక దూరం పాటించాలి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రజలలు ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ ప్రభావం రోజురోజుకూ  పెరిగిపోవడంతో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని దినదిన గండంలా జీవిస్తున్నఈ తరుణంలో... పశువులలో కూడా ఒక వింత జబ్బు మొదలైంది. లింపిస్కిన్ అనే కొత్త వైరస్ మూగజీవులకు సోకుతోంది.
 
ఈ వైరస్ సోకిన పశువులలొ కరోనా లాగానే మొదటిగా జ్వరం రావడం పశువు నీరసించి పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని కొంగలవీడు గ్రామంలో లింపిస్కిన్ అనే కొత్త వైరస్ పశువులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన పశువులలోని లక్షణాలు మొదటగా తీవ్రమైన జ్వరం రావడం ఆ తర్వాత ఒంటిపై మచ్చలు ఏర్పడి అవి పుండ్లుగా మారి ఆ పుండ్లు పగిలి రసి కారుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
 
అయితే ఈ వ్యాధి నివారణకు సంబంధిత మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ వైరస్ ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ఆవులు, ఎద్దులకు సోకుతుందని రైతులు తొందరగా గుర్తించి వైద్య సిబ్బందికి తెలియచేస్తే నివారణ చర్యలు చేపడతామని పశు వైద్య అధికారులు చెప్పుకొస్తున్నారు.
 
ఈ వైరస్ కొంతకాలంగా హర్యానా ఒరిస్సా ప్రాంతాలలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా కడప జిల్లా బద్వేలు మండలం కొంగలవీడు గ్రామంలోని పలు పశువులకు సోకినట్లుగా అధికారులు గుర్తించారు. వైరస్ సోకిన పశువు నుండి మరో పశువుకు సోకకుండా రైతులు పశువులను దూరంగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు పశువులను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినప్పుడు వాటి ఆరోగ్య పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేసుకోవాలని పశు వైద్య అధికారులు రైతులకు తెలియజేస్తున్నారు.
 
కాకపోతే ప్రస్తుతం వైరస్ సోకిన పశువుల యజమాని మాత్రం తన పశువులు రెండు సంవత్సరాల మునపటి నుండి తన వద్దనే ఉన్నాయనీ, దూడలను తెచ్చుకుని తాను పెంచుకున్నానని ఈ వైరస్ ఎలా సోకిందో తనకు అర్థం కావటం లేదని చెప్పుకొస్తున్నారు.