ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (20:53 IST)

రేపు ఏపీలో కొత్తగా 1.15 లక్షల మందికి పెన్షన్

ఏపీ వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద రేపు (బుధవారం) 59.03 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు సర్వం సిద్దమైంది. ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే జూలై నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం 1442.21 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు ఈ సొమ్మును జమ చేసింది. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ సొమ్మును లబ్ధిదారుల చేతికే అందించనున్నారు.

కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ కు బదులుగా జియో ట్యాగింగ్ తో కూడిన ఫోటోలను తీసి అప్‌లోడ్ చేస్తారని సెర్ఫ్ సిఇఓ పి.రాజబాబు తెలిపారు. అలాగే లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో వుండిపోయిన 3364 మంది పెన్షనర్ల సొమ్మును వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లిస్తామని అన్నారు.

అలాగే జిల్లాల పరిధిలో పెన్షన్ బదిలీ కోసం 18,533 మంది, ఇతర జిల్లాలకు తమ పెన్షన్ బదలీ చేయాలని 7501 మంది చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, వారికి కూడా ఆ మేరకు పెన్షన్ బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. 
 
ఈ నెలలో కొత్తగా 1.15 లక్షల మంది అర్హులకు పెన్షన్లు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గత నెలలో పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్న వారిలో మొత్తం 1.15 లక్షల మంది అర్హులకు ఈ నెల నుంచి పెన్షన్ అందచేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లోనే అర్హత వున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేయాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పంను అధికారులు ఆచరణలో చూపుతున్నారని అన్నారు.

ఈ మేరకు గత నెలలో దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పది పనిదినాల్లో పరిశీలించిన అధికారులు, దానికి అనుగుణంగా నిర్ధిష్ట గడువు నాటికి పెన్షనర్లకు పెన్షన్ మంజూరు పత్రాలను అందచేశారని అన్నారు.

ఈ రకంగా పెన్షన్ పొందిన వారికి జూన్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ సొమ్ము వారి చేతికి అందిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లలో 5165 మంది హెల్త్ పెన్షనర్లు వున్నట్లు వెల్లడించారు.

పోర్టబులిటీ ద్వారా పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న 4010 మంది పెన్షనర్లకు కూడా వారు కోరుకున్నప్రాంతంలోనే పింఛన్ అందించేందుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.