గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (06:05 IST)

జగన్ పాలనలో బీసీలకు నిత్యం రక్తాభిషేకాలే: టీడీపీ

రాష్ట్రంలో వైసీపీజమానాలో బీసీలపై జరుగుతున్న దాడులను టీడీపీ రాష్ట్ర బీసీసెల్ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని,  ప్రకాశంజిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలోని కుందుర్పి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి భర్తఅయిన బొల్లినేని కృష్ణయ్యయాదవ్, ఆయన బంధువు వీరాస్వామి యాదవ్ లపై వైసీపీ అరాచకశక్తులు కాపుకాసి వెంటాడి  దాడి చేశాయని టీడీపీ రాష్ట్ర బీసీసెల్ నాయకులు తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ తెలిపారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. అతిభయంకరంగా  దారికాచి టీడీపీ కార్యకర్తలపై దాడిచేశారని, జరుగతున్న దారుణాలు చూస్తుంటే,  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు. 20రోజులక్రితం గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో కూడా ఒకవ్యక్తిపై ఇదేమాదిరి దాడిచేశారన్నారు.

అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలంలో గంగరాజు యాదవ్ అనేవ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారన్నారు.  గంగరాజు భూమిని లాక్కొని అతనిపైనే గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు దాడిచేశారన్నారు. గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు యాదవ్,  సీఐని కూడా అకారణంగా సస్పెండ్ చేశారన్నారు. వారిని ఎందుకు సస్పెండ్ చేశారో ఎవరికీ తెలియదన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో ఆయన సొంత రాజ్యాంగమే అమలవుతోందన్నారు.

ప్రజాస్వామ్యంలో పోటీచేసేవారిపై దాడిచేయడం ద్వారా జగన్ ఎలాంటి సందేశం ఇస్తున్నారన్నారు. బీసీలు తనకు బ్యాక్ బోన్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, ఆ బీసీలపైనే దాడిచేయించడం దారుణమన్నారు. జగన్ ప్రజలను మభ్యపెడుతూ, నాడు – నేడు అంటూ కొత్తగా మోసగిస్తున్నాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దమనకాండ జరుగుతున్నా, జగన్ఎందుకు నోరెత్తడం లేదన్నా రు? 

వైసీపీలో ఉన్న బీసీనేతలకు కూడా సరైన విలువ, ప్రాతినిథ్యం లేవని, బీసీవర్గాలను ఏదో ఉద్ధరించినట్లు జగన్ వారితో పాలాభిషేకాలు చేయించుకుంటున్నాడన్నారు. తనవర్గానికిచెందిన 800 మందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన జగన్, వారితో ఎందుకు పాలాభిషేకాలుచేయించుకోవడం లేదన్నారు. బీసీల ప్రభుత్వమంటూ డబ్బాలు కొట్టుకుంటున్న జగన్, ఆయా వర్గాలవారికి చివరకు రక్తాభిషేకం చేస్తున్నాడన్నారు. 

జగన్ గానీ , ఆయనపార్టీలోని  బీసీనేతలుగానీ, ఈ 18నెలల్లో బీసీలకు ఏంచేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని బీసీలకు ఏప్రభుత్వం ఏంచేసిందో చర్చించడానికి తాముసిద్ధమని, వైసీపీనుంచి ఎవరు చర్చకు వస్తారో రావాలని చంద్రశేఖర్ యాదవ్ సవాల్ విసిరారు. బీసీలకు టీడీపీప్రభుత్వంలో జరిగినమేలేమిటో ఆధారాలతో సహా నిరూపిస్తామని, వైసీపీఏంచేసిందో చర్చించడానికి ఎవరైనా సరే, ఎక్కకడైనాసరే చర్చకు రావచ్చన్నారు. 

బీసీలకు టీడీపీ ప్రభుత్వంలో అనేక రకాలుగా రుణాలు అందాయని,  బీసీ విద్యార్థులు విదేశాలకువెళ్లేందుకు రూ.20లక్షలవరకు సబ్సిడీ రుణంకూడా అందించారన్నారు. జగన్ తనకుటుంబసభ్యులను మాత్రమే విదేశాల్లో చదివించుకుంటూ, రాష్ట్రంలోని బీసీలు, మైనారిటీలు, దళితులకు మొండిచెయ్యి చూపుతున్నాడన్నారు.  బీసీలకు అమలయ్యే ఆదరణపథకం, పెండ్లికి ఇచ్చేసొమ్ము వంటి అనేక పథకాలను జగన్ రాగానేరద్దుచేశాడన్నారు.

టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడుతూ, వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, బీసీలు చనిపోయేవరకు వారిచేతిలో టీడీపీ జెండా ఉంటుందని గ్రహిస్తే మంచిదని చంద్రశేఖర్ యాదవ్ హితవుపలికారు.