శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (09:37 IST)

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎల్లకాలం పేడపిసుక్కుంటూ రెడ్ల ముందు బతకాలన్నదే జగన్ ఆలోచన

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 60వేలమంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించడానికి కృషిచేశారని, జగన్ ముఖ్యమంత్రయ్యాక ఆ పథకాన్ని బెస్ట్  అవేలబుల్ స్కూల్స్) రద్దుచేశారని, టీడీపీ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. 28-09-2020న ప్రభుత్వం ఒకజీవో ఇచ్చిందని, దానిప్రకారం రెండునుంచి పదవ తరగతి మధ్యచదువే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ, ప్రభుత్వపాఠశాలల్లోనే చదవాలని  ఐఏఎస్ అధికారి హర్ష వర్థన్ పేరుతోఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగిందన్నారు. 

అదే జీవోలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమ్మఒడి ఇస్తున్నామని, ప్రభుత్వ ఆర్థికఇబ్బందులధృష్ట్యా, బెస్ట్ అవేలబుల్ స్కూల్ పథకాన్ని రద్దుచేస్తున్నామని చెప్పడం జరిగిందని ప్రసాద్ తెలిపారు. బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ కు ఏడాదికి రూ.50కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, ఆమాత్రం సొమ్ముకూడా లేదని చెప్పిన జగన్ , తనతండ్రి విగ్రహం ఏర్పాటుకి మాత్రం రూ.250కోట్లు ఎలా కేటాయిస్తున్నాడో చెప్పాలన్నారు.

ఆర్థిక ఇబ్బందులు అంటూనే రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు, పంచదార ధరలు పెంచడంతో పాటు, బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన జగన్, రూ250కోట్లు ఖర్చుచేసిమరీ తన తండ్రి విగ్రహాన్ని పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో ఎందుకు పెట్టాలనుకుంటున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చదువే పెద్దఆస్తిఅని, అది గుర్తించే కీ.శే.ఎన్టీఆర్ గానీ, చంద్రబాబునాయుడుగానీ గురుకుల పాఠశాలల ఏర్పాటుచేసి, దళితవిద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడా నికి శాయశక్తులా కృషిచేశారన్నారు. దళిత విద్యార్థులకు జరుగుతున్న అవమానంపై వైసీపీలోని దళితవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని, జగన్ ను ఎందుకు నిలదీయలేకపోతున్నారని సప్తగిరి ప్రసాద్ ప్రశ్నించారు. 

జగన్ ప్రభుత్వం బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ ని రద్దుచేస్తూ ఇచ్చిన జీవోని నిన్న హైకోర్ట్ కొట్టేసిందన్నారు. తమ పిల్లలకు మేలైన విద్యను అందించడంకోసం తాము కోర్టులకెక్కి పోరాడాల్సిన దుస్థితిని  జగన్ ప్రభుత్వం కల్పించిందన్నారు. జగన్ మాదిరే తాముకూడా ప్రతిశుక్రవారం కోర్టులకుహాజరవ్వాలా అని సప్తగిరిప్రసాద్ వాపోయారు.

అమ్మఒడి ఇచ్చినంతమాత్రాన బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ ని రద్దుచేయడమేంటన్నారు? అన్నాక్యాంటీన్ల లో రూ.5లకే భోజనం పెడితే, రాష్ట్రానికిఆర్థికభారమంటూ వాటిని మూసేసిన జగన్, ఇప్పుడు విగ్రహానికి రూ.250కోట్లు ఇవ్వడమేంటన్నారు. అంగన్ వాడీలకు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి, ఆశావర్కర్లకు జీతాలివ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్న జగన్, విగ్రహాలకు మాత్రం వందలకోట్లు ఎలా ఖర్చుచేస్తాడని సప్తగిరిప్రసాద్ నిలదీశారు.

కేంద్రప్రభుత్వం పోలవరం అంచనావ్యయాన్ని సగానికి సగంపైగా తగ్గించినా  నోరు తెరిచి అడగలేని దుస్థితిలో జగన్ ఉన్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బాగా చదువుకుంటే, రేపు వారు ఎక్కడతమకు అడ్డు వస్తారోనన్నభయంతోనే, జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎల్లకాలం రెడ్ల ముంగట పేడపిసుక్కుంటూ, గొడ్లు కాసుకుంటూ బతకాలన్నదే జగన్ కోరికని, అందుకే వారికి నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందకుండా చేశాడన్నారు. 125 అడుగుల  అంబేద్కర్ విగ్రహాన్ని రాజధానిలో పెట్టాలని చంద్రబాబునాయుడు ఆలోచిస్తే, 125 అడుగుల వై.ఎస్ విగ్రహాన్ని పెట్టాలని జగన్ ఆలోచన చేశాడని, వారిద్దరి ఆలోచనలకు మధ్యఉన్న వ్యత్యాసాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు.

చంద్రబాబునాయుడు తన తండ్రి విగ్రహమో, మరెవరిదో పెట్టాలని చూడకుండా, ప్రపంచవ్యాప్తంగా పేరుప్రతిష్టలు పొందిన అంబేద్కర్ మహాశయుడి విగ్రహం పెట్టాలని చూడటం నిజంగా దళితజాతిని సమున్నతంగా గౌరవించడమే అవుతుం దన్నారు.  బెంగుళూరులో, హైదరాబాద్ లో, ఇడుపులపాయలో జగన్ కు ఎస్టేట్లు ఉన్నాయని, అక్కడెక్కడైనా ఆయన తనతండ్రి విగ్రహం పెట్టుకొంటే ఎవరూ కాదనరన్నారు.

తనతండ్రి తనకు అధికారం అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు సంపాదించుకునే మార్గం చూపించాడు కాబట్టి, ఆయనవిగ్రహం పెట్టాలని జగన్ చూస్తున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే చర్యలను జగన్ ఇప్పటికైనా మానుకోవాలని, దళిత వర్గానికి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నోరు తెరిచి జగన్ ను ప్రశ్నించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.

ధళితుల పిల్లలకు తాను మేనమామలంటూ ముద్దులు పెట్టిన జగన్, వారిని నిండా ముంచేశాడన్నారు. జగన్  తక్షణమే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మేలైన, నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ మేనమామ సంబంధాన్ని, ఆయన ముద్దులను ఎస్సీ, ఎస్టీలు కోరడం లేదని, వారుకోరేది వారి పిల్లల బంగారు భవిష్యత్ మాత్రమేనని సప్తగిరి ప్రసాద్ స్పష్టం చేశారు. 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువకునేం దుకు,  అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి పథకం కింద చంద్రబాబు నాయుడిప్రభుత్వం ప్రతిదళిత విద్యార్థికి రూ.15లక్షలు అందించాడ న్నారు. ఆ పథకాన్ని కూడా జగన్ రద్దుచేశాడన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని కూడా అటకెక్కించాడన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే, రాష్ట్రంలో దళితుల పరిస్థితి నానాటికీ దిగజారడం తప్ప, వారు బాగుపడేదిలేదన్నారు.

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు అవసరమైనన్ని నిధులను కేటాయించాలని, ఆయా వర్గాలకు అవసరమైన సబ్సిడీలను తక్షణమే వారికి అందించేలా చూడాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ప్రసాద్ స్పష్టంచేశారు.